AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

భారతీయులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో పాలక్ పనీర్ ఒకటి. పనీర్ ముక్కలు, పాలకూర గ్రేవీతో ఉండే ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యకరమని మనమందరం భావిస్తుంటాం. కానీ, ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ చెబుతున్న విషయాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె ప్రకారం, పాలకూర పనీర్ రెండూ విడివిడిగా అద్భుతమైన ఆహారాలే అయినప్పటికీ, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగా అందవట. ఈ హెచ్చరిక వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి
Nutritional Drawbacks Of Combining Spinach And Paneer
Bhavani
|

Updated on: Jan 21, 2026 | 10:11 PM

Share

ఆరోగ్యంగా తినడం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకున్నప్పుడు అవి ఒకదానిలోని పోషకాలను మరొకటి అడ్డుకుంటాయి. పాలక్ పనీర్ విషయంలోనూ ఇదే జరుగుతోందని నమామి అగర్వాల్ వివరిస్తున్నారు. పాలకూరలోని ఐరన్, పనీర్‌లోని కాల్షియం ఒకదానితో ఒకటి పోటీ పడటం వల్ల శరీరానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

పోషకాల అడ్డంకి

పాలకూరలో ఐరన్ (ఇనుము) పుష్కలంగా ఉంటుంది, పనీర్ కాల్షియానికి నిలయం. అయితే, సైన్స్ ప్రకారం కాల్షియం అనేది ఐరన్ శోషణను అడ్డుకుంటుంది. అంటే మనం పాలక్ పనీర్ తిన్నప్పుడు, పనీర్‌లోని కాల్షియం వల్ల పాలకూరలోని ఐరన్ మన శరీరానికి అందదు. ఫలితంగా ఐరన్ కోసం మనం పాలకూర తిన్నా, దాని వల్ల ఆశించిన ప్రయోజనం కలగదు. పాలకూరలో ఉండే ఆక్సలేట్లు కూడా కాల్షియం ఐరన్ రెండింటి శోషణను పరిమితం చేస్తాయి. దీనివల్ల రెండు పోషకాలూ వృధా అవుతాయి.

ఆయుర్వేదంలో ‘విరుద్ధ ఆహారం’

కేవలం ఆధునిక పోషకాహార శాస్త్రం మాత్రమే కాదు, మన ప్రాచీన ఆయుర్వేదం కూడా కొన్ని ఆహార కలయికలను నిషేధించింది. వీటిని ‘విరుద్ధ ఆహారం’ అని పిలుస్తారు. పాలు చేపలు, అరటిపండు మరియు పాలు, తేనె నెయ్యి (సమాన పరిమాణంలో) వంటి కలయికలు శరీరంలో విషతుల్యాలను పెంచుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అదేవిధంగా, పాలకూర పనీర్ కలయిక కూడా శరీరానికి మేలు చేయదని, ఇలాంటి ఆహార అలవాట్లు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

సరైన పద్ధతి ఏమిటి?

మీకు పాలకూరలోని ఐరన్ పూర్తిస్థాయిలో అందాలంటే దానిని విడిగా లేదా కాల్షియం లేని పదార్థాలతో కలిపి తీసుకోవాలి. ఉదాహరణకు పాలకూర బంగాళాదుంప (పాలక్ ఆలూ) లేదా పాలక్ కార్న్ వంటివి మెరుగైన ప్రత్యామ్నాయాలు. అలాగే పనీర్‌ను కాల్షియం అవసరమైనప్పుడు విడిగా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నప్పుడు, అది శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందనే అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.