
చిన్నారులకు నీతి కథలు చెప్పడం వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ఈ నీతి కథలు ప్రేరణగా నిలుస్తాయి. నిజాయితీ, కష్టపడి పనిచేయడం, ఇతరుల పట్ల మంచిగా ఉండడం వంటి విలువలను చిన్న వయసులోనే అలవర్చేందుకు నీతి కథలు చక్కటి మార్గం. పిల్లలకు నైతిక విలువలు, నిజాయితీని బోధించే ప్రసిద్ధ కథల్లో ఒకటే ‘కట్టెలు కొట్టేవాడు – దేవత కథ’. నిజాయితీతో జీవిస్తే తప్పక ప్రతిఫలం దక్కుతుందని ఈ కథ గుండెకు హత్తుకునేలా వివరిస్తుంది.
చాలా కాలం క్రితం ఓ చిన్న గ్రామంలో ఒక కట్టెలు కొట్టేవాడు జీవించేవాడు. కుటుంబాన్ని పోషించేందుకు అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ప్రతిరోజూ సమీపంలోని అడవికి వెళ్లి చెట్లు నరికి, వాటిని గ్రామానికి తీసుకొచ్చి అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు. పెద్దగా సంపాదన లేకపోయినా, తన జీవితంతో సంతృప్తిగా ఉండేవాడు.
ఒక రోజు నది ఒడ్డున చెట్టు నరుకుతుండగా, అతని చేతిలోని ఇనుప గొడ్డలి జారి నదిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండటంతో దానిని తిరిగి తెచ్చుకునే మార్గం కనిపించలేదు. ఆ గొడ్డలి అతని జీవనోపాధి కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చివరికి అతను దేవతను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు.
అతని ప్రార్థనకు స్పందించిన దేవత ప్రత్యక్షమై, సమస్య ఏమిటని అడిగింది. విషయం తెలుసుకున్న దేవత నదిలోకి చేయి పెట్టి ముందుగా ఒక వెండి గొడ్డలిని తీసి..‘ఇది నీదేనా?’ అని అడిగింది. కట్టెలు కొట్టేవాడు నిజాయితీగా.. ‘కాదు, అది నాది కాదు’ అని చెప్పాడు.
మళ్లీ దేవత బంగారు గొడ్డలిని తీసి.. ‘ఇది నీదేనా?’ అని అడిగింది. అతను మళ్లీ.. ‘కాదు. అది కూడా నాది కాదు. బంగారు గొడ్డలితో నేను పని చేయలేను’ అని సమాధానమిచ్చాడు.
చివరగా దేవత అతని ఇనుప గొడ్డలిని బయటకు తీసి చూపించగా, కట్టెలు కొట్టేవాడు ఎంతో ఆనందంతో ‘అవును, ఇదే నాది’ అని చెప్పాడు.
అతని నిజాయితీకి ముగ్ధురాలైన దేవత.. ఇనుప గొడ్డలితో పాటు వెండి, బంగారు గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చింది.
ఈ నీతి కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. తాత్కాలిక లాభాల కోసం అబద్ధాలు చెప్పకుండా, ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ, మంచితనం, కష్టపడే తత్వం ఉన్నవారికి జీవితంలో ఎప్పటికైనా తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి. నిజాయితీకి ఎప్పుడూ మంచి ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: మూడు చేపల కథ.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ నష్టం తథ్యం..!