నీతి కథ: తెలివైన నక్క.. బలం లేకపోయినా తెలివితేటలతో విజయం తథ్యం..!

Fox Moral Story: నీతి కథలు నైతిక విలువలను నేర్పించడంతో పాటు వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకతను నేర్పుతాయి. ఇక్కడ ఇచ్చిన నీతి కథలో.. ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి లేకపోయినా.. ఒక నక్క తన తెలివితేటలతో సింహం, పులి, చిరుతలను మోసం చేసి తన లక్ష్యాన్ని సాధించింది. బలం కంటే తెలివితేటలే గొప్పవని, సరైన సమయంలో సరైన వ్యూహం విజయాన్ని అందిస్తుందని చెప్పే ఈ ఆసక్తికరమైన నీతి కథ పిల్లలు, పెద్దలను ఆలోచింపజేస్తుంది.

నీతి కథ: తెలివైన నక్క.. బలం లేకపోయినా తెలివితేటలతో విజయం తథ్యం..!
Clever Fox Moral Story
Image Credit source: AI

Updated on: May 30, 2026 | 1:42 PM

నీతి కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు జీవితానికి అవసరమైన నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, మంచి ఆలోచనలు నేర్పించడానికి ఉపయోగపడతాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఇవి మార్గదర్శకంగా ఉంటాయి. నీతి కథలు చదవడం ద్వారా ఏది మంచూ? ఏదో చెడో? అర్థమవుతుంది. బలం లేకపోయినా తెలివితేటలతో ఎలా విజయం సాధించవచ్చో ఈ నీతి కథ ద్వారా మనకు అర్థమవుతుంది.

కథ

అనగనగా ఓ అడవిలో నక్క ఉండేది. ఆ నక్కకు చాలా కాలంగా ఏనుగు మాంసం తినాలనే కోరిక ఉండేది. ఒకరోజు అది అడవిలో తిరుగుతుండగా చనిపోయి పడివున్న ఒక భారీ ఏనుగు కనిపించింది. ఏనుగును చూసిన నక్క ఆనందంతో ఉప్పొంగిపోయింది. అయితే దాని ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఏనుగు చర్మం చాలా మందంగా ఉండటంతో దానిని చీల్చే శక్తి నక్కకు లేదు.

అప్పుడు నక్క తన బలాన్ని కాకుండా తెలివితేటలను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. కొద్దిసేపటికి అక్కడికి ఒక సింహం వచ్చింది. నక్క వినయంగా నమస్కరించి, “మృగరాజా! ఈ ఏనుగుకు నేను కాపలా కాస్తున్నాను. మీరు దీన్ని ఆరగించండి” అని చెప్పింది. అయితే సింహం, “నేను వేటాడిన జంతువునే తింటాను. చనిపోయిన జంతువులను ముట్టను” అని చెప్పి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

తర్వాత అక్కడికి ఒక పులి వచ్చింది. నక్క వెంటనే కొత్త ఎత్తుగడ వేసింది. “ఈ ఏనుగును సింహం వేటాడింది. నన్ను కాపలా పెట్టి వెళ్లింది. పులి దీన్ని తింటే శిక్షిస్తానని చెప్పింది” అని అంది. ఆ మాటలు విన్న పులి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కొంతసేపటికి ఒక చిరుతపులి అక్కడికి వచ్చింది. ఈసారి నక్క తన లక్ష్యాన్ని సాధించేలా ఓ ప్లాన్ వేసింది. “సింహం వచ్చేలోపు మనిమిద్దరం ఈ మాంసాన్ని తిందాం” అంటూ చిరుతను ప్రలోభపెట్టింది. మొదట చిరుత సందేహించినా, నక్క మాటలు నమ్మి తన పదునైన గోర్లు, పళ్లతో ఏనుగు చర్మాన్ని చీల్చింది.

చిరుత మాంసాన్ని తినబోతుండగానే, “మృగరాజు వస్తున్నాడు!” అని నక్క పెద్దగా అరిచింది. ఆ మాట విన్న చిరుత భయంతో పరుగులు తీసింది. దీంతో నక్కకు కావలసిన పని పూర్తయింది. అది హాయిగా ఏనుగు మాంసాన్ని తింటూ తన కోరికను తీర్చుకుంది.

నీతి

బలం లేని చోట తెలివితేటలు గొప్ప ఆయుధంగా పనిచేస్తాయి. సరైన సమయంలో సరైన ఆలోచన చేస్తే అసాధ్యంగా కనిపించే పనులను కూడా సాధించవచ్చు.

నీతి కథలు సమయస్ఫూర్తి, నిజాయితీ, క్రమశిక్షణ, దయ, సహనం వంటి మంచి గుణాలను పెంపొందిస్తాయి. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, తెలివిగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నేర్పిస్తాయి.

Follow Us