టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం.. గుడిలో ప్రసాదంలా కమ్మగా వస్తుంది!
పండుగలు, ప్రత్యేక వేడుకల సమయంలో బయట కొనే మిఠాయిలకు బదులుగా, ఇంట్లోనే ఎంతో రుచికరమైన, రసంతో కూడిన మీఠీ బూందీని సులభంగా తయారు చేసుకోవచ్చు. వేయించిన బూందీని వెంటనే గోరువెచ్చని పల్చని పాకంలో వేసి కొన్ని నిమిషాలు ఉంచితే, అది రసాన్ని పూర్తిగా పీల్చుకుంటుంది. అంతే, ఎంతో మృదువైన, నోట్లో కరిగిపోయే జ్యూసీ బూందీ రెడీ అవుతుంది.

పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ఇళ్లలో రకరకాల మిఠాయిలు తయారు చేస్తుంటారు. అందులోనూ మీఠీ బూందీ లేదా బూందీ లడ్డూ అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మార్కెట్లో దొరికే మిఠాయిలలో కల్తీ భయం ఉండటంతో పాటు నాణ్యత గురించి ఆందోళన ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ, అచ్చం టెంపుల్ స్టైల్‌లో మెత్తగా, రసంతో నిండిన జ్యూసీ మీఠీ బూందీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బూందీ తయారీకి కావలసిన పదార్థాలు
శెనగపిండి : 1 కప్పు
నీరు: అర నుండి ముప్పావు కప్పు పిండి కలపడానికి
బేకింగ్ సోడా: చిటికెడు
చక్కెర: 2 కప్పులు
నీరు పాకం కోసం: 1.5 కప్పులు
యాలకుల పొడి లేదా కుంకుమపువ్వు: తగినంత
వేయించడానికి: నూనె లేదా నెయ్యి
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి తీసుకుని, అందులో చిటికెడు వంట సోడా, కొద్దికొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. పిండి మరీ చిక్కగా లేదా మరీ పల్చగా ఉండకూడదు. జారుడుగా, గరిటెతో జారేలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.
ఇప్పుడు వేరొక పాత్రలో 2 కప్పుల చక్కెర, 1.5 కప్పుల నీరు పోసి మరిగించాలి. అందులో సువాసన కోసం యాలకుల పొడి లేదా కుంకుమపువ్వు కలపాలి. చక్కెర కరిగిన తర్వాత కేవలం ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. పాకం మరీ చిక్కగా ఉండకూడదు. పల్చని పాకం అయితేనే బూందీ లోపలి వరకు రసాన్ని పీల్చుకుంటుంది.
కడాయిలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. రంధ్రాలు ఉన్న గరిటెను నూనెకు కొద్దిగా పైన పట్టుకుని, అందులో శెనగపిండి మిశ్రమాన్ని పోయాలి. బూందీలు నూనెలో పడి చక్కటి గుండ్రని ఆకారంలో వస్తాయి. మంటను మీడియంగా ఉంచి బూందీలను మంచి బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించాలి. వేయించిన బూందీలను నూనె నుండి తీసి నేరుగా గోరువెచ్చని పల్చని పాకంలో వేయాలి. వాటిని కనీసం 2 నుండి 5 నిమిషాల పాటు పాకంలో నాననివ్వాలి. ఆ తర్వాత అదనపు పాకం కారిపోయేలా జల్లెడ గరిటెలోకి తీసుకోవాలి.
అంతే! ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే బూండీ రెడీ.. గుడిలో ప్రసాదంలా కమ్మగా వస్తుంది! దీన్ని గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 5 నుండి 7 రోజుల వరకు తాజాగా ఉంటుంది.




