
ఇంట్లో దోమలు, బొద్దింకల బెడద వేధిస్తోందా? రసాయనాలు ఉన్న స్ప్రేలు వాడటం కంటే మన ఇంట్లో దొరికే కర్పూరంతో వీటికి చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యానికే కాకుండా ఇంటి నిర్వహణలోనూ కర్పూరం చేసే మేలు గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మనకు కర్పూరం అంటే పూజ గదిలో వెలిగించే హారతే గుర్తొస్తుంది. కానీ కర్పూరం కేవలం భక్తికి మాత్రమే కాదు, ఇంటి నిర్వహణలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. చీమలు, దోమలను తరిమికొట్టడం నుంచి నొప్పులను తగ్గించడం వరకు కర్పూరంతో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
కీటకాలకు చెక్ పెట్టండిలా..
ఇంట్లో బొద్దింకలు, బల్లుల బెడద ఎక్కువగా ఉంటే రెండు గ్లాసుల నీటిలో కర్పూరం పొడి, పసుపు, రాతి ఉప్పు, కొంచెం షాంపూ కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. కీటకాలు తిరిగే చోట దీనిని చల్లితే అవి క్షణాల్లో పారిపోతాయి. ఇల్లు తుడిచే నీటిలో ఈ మిశ్రమం కలిపితే గది సువాసనగా ఉండటమే కాకుండా క్రిములేవీ రావు.
చీమలు, దోమల నివారణ
చక్కెర, బెల్లం డబ్బాలకు చీమలు పడుతుంటే.. నీటిలో కర్పూరం పొడి కలిపి ఆ నీటితో డబ్బాలను తుడిస్తే చీమలు రావు. ఇక దోమల విషయానికి వస్తే, ఆవాల పొడి, కర్పూరం పొడి, దాల్చిన చెక్క ముక్కలు నూనెలో వేసి దీపం వెలిగిస్తే దోమలు దరిచేరవు.
అల్మారాల్లో తేమ పోవాలంటే..
వర్షాకాలంలో బట్టలు, పుస్తకాల అరల్లో తేమ చేరి చెడు వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఒక చిన్న గిన్నెలో కర్పూరం పొడి, బియ్యం కలిపి ఉంచితే అది తేమను పీల్చుకుంటుంది. కర్పూరం బిళ్లలను చిన్న చిన్న ముక్కలు చేసి బట్టల మధ్య ఉంచితే కీటకాలు దరిచేరవు. కర్పూరం త్వరగా ఆవిరైపోకుండా ఉండాలంటే ఆ డబ్బాలో కొన్ని మిరియాలు వేయాలి.
ఆరోగ్యం.. ఆహ్లాదం
కీళ్ల నొప్పులు లేదా జలుబు వేధిస్తుంటే కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కర్పూరం వేయాలి. ఈ నూనెను నొప్పి ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆదివారం, మంగళవారం సాయంత్రం పూట లవంగాలు, ఏలకులు, కర్పూరాన్ని కలిపి వెలిగించి ఇల్లంతా ఆ పొగను చూపిస్తే ఇంట్లో ప్రతికూల శక్తి పోయి ప్రశాంతత నెలకొంటుంది. దీపపు వత్తిపై కొద్దిగా కర్పూరం చల్లితే వెలిగించిన వెంటనే త్వరగా అంటుకోవడమే కాకుండా మంచి సువాసన వస్తుంది.