Mangoes: ఇవి మామిడి పండ్లనుకుంటే మోసపోతారు.. కార్బైడ్‌తో పండించే పండ్లను గుర్తించే సీక్రెట్స్ ఇవి..

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల రుచి చూడాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతారు. అయితే, మనం తింటున్న మామిడి పండ్లు సహజంగా పండాయా లేదా కృత్రిమంగా రసాయనాలతో పండించారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్బైడ్ వంటి రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఇవి మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు క్యాన్సర్ కారకాలుగా కూడా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లను తినకపోవడమే ఉత్తమం.

Mangoes: ఇవి మామిడి పండ్లనుకుంటే మోసపోతారు.. కార్బైడ్‌తో పండించే పండ్లను గుర్తించే సీక్రెట్స్ ఇవి..
Mngoes Riped With Carbide

Updated on: May 16, 2025 | 3:51 PM

సాధారణ అంశాలను పరిశీలించడం ద్వారా మనం ఈ తేడాను సులభంగా గుర్తించవచ్చు. కార్బైడ్ మామిడికి, సహజంగా పండిన మామిడికి మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లు సాధారణంగా పండు మొత్తం ఒకే రంగులో ఉంటాయి. అక్కడక్కడ ఆకుపచ్చని లేదా నల్లని మచ్చలు కనిపిస్తాయి. అదే సహజంగా పండిన మామిడి పండు అయితే కాస్త ఎరుపు, పసుపు రంగులు కలిసి ఉంటాయి. ఒకే విధమైన రంగు లేకుండా సహజమైన ఛాయలతో కనిపిస్తుంది.

సహజంగా పండిన మామిడి పండ్లను చేత్తో నొక్కితే చాలా మెత్తగా, పండిన వాసనతో తియ్యగా అనిపిస్తుంది. అదే కార్బైడ్ తో పండిన మామిడి పండు అంత మెత్తగా ఉండదు. పైకి పండినట్లు కనిపించినా లోపల గట్టిగా ఉంటుంది. దీనికి పండు యొక్క సహజమైన వాసన కూడా ఉండదు. కొన్నిసార్లు రసాయనాల వాసన రావచ్చు.

కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించడానికి ఒక సులభమైన పరీక్ష ఉంది. వాటిని నీళ్లలో వేస్తే అవి నీటిపై తేలుతాయి. అదే సహజసిద్ధంగా పండిన పండ్లు అయితే నీటిలో మునుగుతాయి. ఈ తేడాను గమనించడం ద్వారా కల్తీ పండ్లను గుర్తించవచ్చు.

సహజమైన మామిడి పండుకు ఉండే మృదుత్వం కార్బైడ్ తో పండించిన పండుకు అస్సలు ఉండదు. కార్బైడ్ కేవలం పండు పైభాగాన్ని మాత్రమే పండిస్తుంది. దాని లోపలి భాగం మాత్రం పండదు. కోసి చూస్తే లోపల తెల్లగా కనిపిస్తుంది మరియు అంత తియ్యగా ఉండదు, కొద్దిగా పులుపుదనం ఉంటుంది. కానీ సహజంగా పండిన మామిడి పండు లోపల కూడా పూర్తిగా పండి ఎర్రగా లేదా పసుపు రంగులో కనిపిస్తుంది.

రుచి విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది. సహజంగా పండిన మామిడి పండు తినడానికి చాలా తియ్యగా ఉంటుంది. పులుపుదనం ఏమాత్రం ఉండదు. అంతేకాకుండా, సహజంగా పండిన మామిడి పండులో రసం ఎక్కువగా వస్తుంది. తినడానికి చాలా జ్యూసీగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా కార్బైడ్ తో పండిన మామిడి పండ్ల నుంచి పెద్దగా రసం రాదు. అలాగే అవి అంత తియ్యగా కూడా ఉండవు. వాటికి ఒక రకమైన కృత్రిమమైన రుచి ఉండవచ్చు.