వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు..

సంతానలేమి అనగానే సమాజంలో ఇప్పటికీ చాలామంది తప్పు అంతా మహిళలదే అనుకుంటారు. కానీ పురుషుల్లో ఉండే లోపాలు కూడా ప్రధాన కారణం కావచ్చు. సాధారణంగా పురుషుల సంతానోత్పత్తి సమస్య అనగానే ప్రతి ఒక్కరూ వీర్య కణాల సంఖ్య గురించే మాట్లాడుతుంటారు. కానీ కేవలం కౌంట్ మాత్రమే ఉంటే పిల్లలు పుడతారా? నాణ్యత లేకపోతే ఏమవుతుంది? వైద్య నిపుణులు ఈ అంశంపై ఏమంటున్నారో తెలుసుకుందాం.

వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు..
Sperm Count Vs Quality

Updated on: Jul 26, 2026 | 11:40 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఒక జంట ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు వాడకుండా 12 నెలల పాటు నిరంతరం ప్రయత్నించినప్పటికీ గర్భం దాల్చలేకపోతే దానిని ఇన్‌ఫెర్టిలిటీగా పరిగణిస్తారు. సమాజంలో సాధారణంగా ఈ సమస్య అనగానే కేవలం మహిళల వైపే చూస్తుంటారు. కానీ సంతాన సమస్యలకు పురుషులు కూడా సమాన కారణం కావచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పురుషులలో సంతానోత్పత్తి సమస్యలకు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా వాటి మొటిలిటి మందగించడమే ప్రధాన కారణం. హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, అదుపులో లేని మధుమేహం తో పాటు ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు జీవనశైలి అలవాట్లు వీర్య కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అతిపెద్ద సందేహం.. పురుషుల సంతానోత్పత్తికి వీర్య కణాల సంఖ్య ముఖ్యమా? లేక వాటి నాణ్యత ముఖ్యమా?

కౌంట్ వర్సెస్ క్వాలిటీ: ఏది అత్యంత ముఖ్యం?

ప్రముఖ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య గోస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం అనగానే చాలామంది కేవలం వీర్య కణాల సంఖ్య గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి సంఖ్య మాత్రమే సర్వస్వం కాదు.. దానితో పాటు నాణ్యత కూడా అంతే ప్రధానమైనది.

వీర్య కణాల సంఖ్య : వీర్యంలో మొత్తం ఎన్ని శుక్రకణాలు ఉన్నాయో ఇది తెలియజేస్తుంది.

వీర్య కణాల నాణ్యత : ఆ శుక్రకణాలు తమ పనిని ఎంతవరకు సరిగ్గా నిర్వర్తించగలవో ఇది నిర్ధారిస్తుంది. ఇందులో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

మొటిలిటి: కణాలు ఎంత వేగంగా, చురుగ్గా కదులుతున్నాయి.

ఆకారం: కణాల పరిమాణం, నిర్మాణం సరిగ్గా ఉందో లేదో చూస్తుంది.

జన్యు పదార్థం: కణాలలోని జన్యు సంపద ఆరోగ్యంగా ఉందో లేదో సూచిస్తుంది.

చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుంటే..

ఒక వ్యక్తి శరీరంలో వీర్య కణాల సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు సరిగ్గా ఈత కొట్టలేకపోయినా లేదా వాటి ఆకారం సరిగా లేకపోయినా.. అవి స్త్రీ అండాన్ని చేరి ఫలదీకరణం చెందించడం చాలా కష్టం. అదే సమయంలో ఒక వ్యక్తిలో వీర్య కణాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ.. ఉన్న ఆ కొద్ది కణాలు మంచి నాణ్యతతో, చురుగ్గా, సరైన ఆకారంలో ఉంటే సులభంగా గర్భధారణ సాధ్యమవుతుంది. అందుకే కేవలం కౌంట్ ఆధారంగా ఒకరి సంతానోత్పత్తి శక్తిని అంచనా వేయలేమని.. వీర్య విశ్లేషణ ద్వారానే పూర్తి చిత్రాన్ని పొందగలమని నిపుణులు చెబుతున్నారు.

IVF వంటి చికిత్సలకు నాణ్యతే కీలకం

సాధారణ గర్భధారణలోనే కాకుండా IVF లేదా ఐయూఐ వంటి అధునాతన సంతానోత్పత్తి చికిత్సలలో వీర్య కణాల నాణ్యత అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. వీర్యం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఫలదీకరణం అంత బాగా జరిగి, ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.

కాబట్టి వీర్య కణాల సంఖ్య లేదా నాణ్యత అని వేరువేరుగా చూడకుండా.. మొత్తం వీర్య ఆరోగ్యంను మెరుగుపరుచుకోవడమే అసలైన పరిష్కారం. సరైన జీవనశైలి మార్పులు, సమతులాహారం, క్రమబద్ధమైన వ్యాయామం, వైద్యుల సలహాతో తీసుకునే మందులు, హార్మోన్ల చికిత్సల ద్వారా వీర్య కణాల సంఖ్యను, నాణ్యతను పెంచుకుని సంతాన లేమి సమస్య నుంచి బయటపడవచ్చు.

Follow Us