
ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ఈ మాయదారి రోగం ఒక్కసారి వచ్చిందంటే అంత సులభంగా తగ్గుముఖం ప్టటదు. అయితే ప్రస్తుతం మారిన కాలంతో పాటు చికిత్స విధానాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. క్యాన్సర్ మహమ్మారిని కూడా జయించే రోజులు వచ్చేశాయ్. అయితే వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తిస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు పరిశోధకులు నిత్యం పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్ నేచర్ కమ్యునికేషన్ జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. పరిశోధకులు అభిప్రాయం ప్రకారం కేవలం ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా 19 రకాల క్యాన్సర్‌లను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు.. క్యాన్సర్ రావడానికి 7 ఏళ్ల ముందుగానే ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇందుకోసం బ్రిటన్‌కు చెందిన సుమారు 44 వేల మందిని పరిగణలోకి తీసుకొని వారి రక్త నమూలను పరిశీలించారు. వీరిలో 4900 మందికి క్యాన్సర్ వచ్చింది. పరిశోధనా బృందం 1463 మంది రక్తంలోని ప్రోటీన్లను పరిశీలించింది. ఈ పరిశోధనలో, 618 రకాల ప్రొటీన్లు 19 రకాల క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఇందులో పేగు, ఊపిరితిత్తులు, నాన్-హాడ్కిన్ లింఫోమా, కాలేయ క్యాన్సర్ వంటివి ఉన్నాయి.
క్యాన్సర్ తొలి దశను గుర్తించేందుకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. యూకేలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ ఫౌల్కేస్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాన్సర్‌ను వీలైనంత త్వరగా గుర్తించడం వల్ల రోగాన్ని నయం చేసుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..