
పిల్లలు తెలివిగా ఎదగాలంటే కొన్ని మంచి అలవాట్లు నేర్పించాలి. ఉదయం పూట చేసే చిన్న పనులు కూడా వారిలో బుద్ధి, ఒకే విషయంపై దృష్టి పెట్టడం, ధైర్యం పెరగడానికి ఉపయోగపడతాయి. పిల్లల మనసు బలంగా మారాలంటే తల్లిదండ్రులు ఈ అలవాట్లను తప్పకుండా నేర్పించాలి.
పిల్లలు నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా అవసరం. ఇది డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. మెదడుకి అవసరమైన తేమ అందుతుంది. ఫోకస్ బాగుండేలా చేస్తుంది. అంతేకాక జీర్ణక్రియ సజావుగా నడవడం వల్ల శరీరం హాయిగా ఉంటుంది.
పిల్లలు ఉదయాన్నే ఆలస్యం చేయకుండా లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం సమయం ప్రశాంతంగా ఉండటం వల్ల చదువులు, ఇతర మానసిక పనులు సులభంగా పూర్తవుతాయి. తొందరగా లేచినప్పుడు మిగతా పనులకూ సమయం దొరుకుతుంది.
ఉదయం పూట భోజనం మానకూడదు. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులు ఉన్న ఆహారం తినాలి. ఉదయం మంచిగా తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఒకే విషయంపై బాగా శ్రద్ధ పెట్టగలరు.
పిల్లలు నిత్యం కనీసం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది రక్తప్రసరణ మెరుగుపరచి మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. పిల్లల్లో దృష్టి, చైతన్యం పెరుగుతుంది.
ధ్యానంతో మానసిక ప్రశాంతత.. ఉదయాన్నే కొన్ని నిమిషాలపాటు మౌనంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది. రోజంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇది దోహదం చేస్తుంది.
పిల్లలకు రోజూ ఏదైనా కొత్త విషయం చదవాలనే ఆసక్తిని పెంచాలి. ఇది వారి ఆలోచన శక్తిని పెంచుతుంది. మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది.
పిల్లలకు చిన్న చిన్న టార్గెట్లు ఇవ్వడం వల్ల వాళ్లు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఒక రోజులో ఈరోజు ఒక పాఠం చదవాలి, పుస్తకాలు సర్దాలి అని చెప్పడం. ఇలా ఆ పనులు అయిపోతే తాము ఏదో సాధించామని వాళ్లకు అనిపిస్తుంది. దానివల్ల వాళ్ల నమ్మకం పెరుగుతుంది.
ప్రతి ఉదయం పిల్లలతో రెండు మూడు మంచి విషయాలు చెప్పించి.. వాటికి థాంక్స్ చెప్పే అలవాటు చేస్తే వాళ్లకు చెడు ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు పెరుగుతాయి. ఇది వాళ్ల మనసును బలంగా చేస్తుంది.
పిల్లలు బాగా ఎదగాలంటే కేవలం చదువు ఒక్కటే కాదు.. మంచి అలవాట్లు కూడా చాలా ముఖ్యం. ఉదయం పూట చేసే ఈ చిన్న చిన్న పనులే వాళ్లు భవిష్యత్తులో గొప్పగా ఎదగడానికి తోడ్పడతాయి. తల్లిదండ్రులు ఈ మంచి అలవాట్లను పిల్లలు రోజూ పాటించేలా చూసుకుంటే వారు తెలివిగా, ధైర్యంగా ఎదుగుతారు.