
జ్యోతిష్య శాస్త్రంలో సింహ సంక్రాంతి కి విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యభగవానుడు కర్కాటక రాశి నుండి తన స్వంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించే రోజును సింహ సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, పితృ దోషాల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. సింహ సంక్రాంతి రోజున చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం..
సింహ సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం చేయడం శుభప్రదం. వీలుకాని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత రాగి చెంబులో నీరు, ఎర్రటి పూలు, అక్షతలు, కొద్దిగా బెల్లం వేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో ఓం సూర్యాయ నమః లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల జాతకంలో సూర్యుని బలం పెరుగుతుంది.
పితృ దోషాల వల్ల కుటుంబంలో తరచూ అనారోగ్య సమస్యలు, సంతాన లేమి, ఆర్థిక నష్టాలు లేదా వివాహ సమస్యలు ఎదురవుతాయి. సింహ సంక్రాంతి రోజున దక్షిణ దిశ వైపు ముఖం నిలిపి పితృదేవతలను తలచుకుంటూ నువ్వులు, నీటితో తర్పణం వదలాలి. వీలైతే పండితుల సమక్షంలో పిండ ప్రదానం చేయడం ద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరుతుంది.
పితృ దోష నివారణలో దానం అత్యంత శక్తివంతమైనది. ఈ పవిత్ర రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు గోధుమలు, ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్రలు, బెల్లం, నెయ్యి దానం చేయాలి. అలాగే ఆవులకు పచ్చిగడ్డి లేదా ఆహారం తినిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.
సాయంత్రం వేళ ఇంటి రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి పితృదేవతలను ప్రార్థించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సింహ సంక్రాంతి నాడు భక్తిశ్రద్ధలతో ఈ పరిహారాలు పాటించడం ద్వారా పితృ దోషాల తీవ్రత తగ్గి, కుటుంబంలో సుఖసంతోషాలు, అభివృద్ధి, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..