
రోజంతా రీల్స్ చూడటం.. చూసిన వాటిని తిరిగి షేర్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. ఇదిలా ఉంటే వెబ్ సిరీస్ లకు అలవాటు పడిన వారి తీరు మరోలా ఉంటుంది. తింటున్నా, బాత్రూంలో ఉన్నా సిరీస్ ను మొదలుపెడితే ముగించేదాకా ఆపరు. యూట్యూబ్ చూసేవారన్నా కాసేపు చూడటానికి, వినడానికి సమయాన్ని కేటాయిస్తారేమో.. కానీ ఈ షార్ట్స్, రీల్స్ కు అలవాటు పడినవారు మాత్రం బొటన వేలుకు విరామం లేకుండా పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ టీవీ సిరీస్ లు, రీల్స్ వంటివి యూత్ లోనే కాదు.. పెద్దవారిలోనూ కొత్త రకమైన అడిక్షన్ ను కలిగిస్తున్నాయి. దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో కూడా చెప్పలేనంత ఆందోళన కలిగిస్తున్నాయి.
నిరంతరం స్క్రోలింగ్ కు అలవాటుపడిన వారు రోజులో ఎన్నో గంటలు వేస్ట్ చేస్తుంటారు. ఈ సమస్య ఒక్క సమయానిదే కాదు.. వారి భవిష్యత్తుది కూడా. కొంతకాలానికి వీరిలో ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించలేరు, ఎవరితోనూ కనెక్ట్ కాలేరు.
ఎంటర్ టైన్మెంట్ పరిశ్రమకు నిరంతరం ఆడియెన్స్ అటెన్షన్ కావాలి. అందుకోసం వెరైటీలతో కూడిన కంటెంట్ ను మీమీదకి ఉసిగొల్పుతుంది. మీ మనస్సును మళ్లించడానికి అవసరమైన అన్ని రకాల అస్త్రాలను ఉపయోగిస్తుంది. టీవీల్లో వచ్చే ఎపిసోడ్ లనే చూడండి.. ట్విస్టులతో ఇవాళ్టి ఎపిసోడ్ ను ముగిస్తారు.. మిగితాది రేపటి ఎపిసోడ్ లో చూడమంటారు.. స్టే ట్యూన్డ్ అంటూ ఊదరగొడుతుంటారు. ఇక ఇన్ స్టా రీల్స్ చూసేవారికి మరింత ప్రమాదం పొంచిఉంది. సెనన్ల వ్యవధిలో ఒక్క స్వైప్ తో మారే కంటెంట్, మీ మైండ్ ను ఒక్కసారిగా ప్రేరేపించే మ్యూజిక్ బైట్స్.. ఇవన్నీ మీ బుర్రలో డోపమైన్ ను విడుదల చేస్తాయి. ఎదుటి వారు మాట్లాడుతున్నా మీ తలకెక్కదు. పక్కనేం జరుగుతున్న పట్టదు. ఇలాంటి కంటెంటే ఇంకా ఇంకా కావాలని మీ మనసు మొండికేస్తుంది. అది ఇచ్చేదాకా మీ మనసు శాంతించదు. ఈ లక్షణాలన్నీ మీరు డిజిటల్ ట్రాప్ లో పడ్డారని తెలిపే బలమైన సంకేతాలు.
కొంత కాలానికి మీరు దేని మీదా శ్రద్ధ పెట్టలేరు. నెమ్మదిగా చేయాల్సిన పనులు, ఓర్పుతో చేయాల్సిన టాస్కుల్లో మీ పర్ఫార్మెన్స్ జీరో అవుతుంది. అన్నింటికన్న పెద్ద రిస్క్ ఏమిటంటే.. ఇన్ని రకాలుగా ఫోన్ తో బిజీగా ఉంటున్నప్పటికీ మీ మనసులో ఏదో తెలియని వెలితి మొదలవుతుంది. అది మెల్లగా పెరిగిపోయి ఒంటరితనమే మీకు తోడవుతుంది. బయటి ప్రపంచంతో పూర్తిగా డిస్ కనెక్ట్ అవుతారు. ఈ అలవాటు మీ మెంటల్ హెల్త్ ను పూర్తిగా దెబ్బతీసేస్తుంది.
మీ చుట్టూ ఉన్న విషయాలను గమనించడం ఆగిపోయన రోజు మీ పతనం కూడా మెల్లగా మొదలవుతుంది. క్వాలిటీ లేని జీవితం మీ సొంతమవుతుంది. మీరు మనిషే ఉంటారు. కానీ మనసును నిలపలేరు. ఇది మెల్లిమెల్లిగా మీ వారిని మీ నుంచి దూరం చేస్తుంది. మీ పనిలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మీరు విశ్రాంతి తీసుకునే సమయం కూడా తగ్గిపోయి అక్కడ కూడా ఇంకొక్క ఎపిసోడ్ చూద్దాం అనే భావన కలుగుతుంటుంది. కానీ లోలోపలే జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది.
రానున్న కాలంలో మీరు మర మనుషుల్లా మారిపోతారు. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు.. ఎదుటి వారు చెప్పేది వినేంద సహనం మీలో ఉండదు. మీ ఆలోచనలు, భావోద్వేగాల మీద కూడా పట్టు కోల్పోతారు.. ఆఖరికి మిమ్మల్ని మీరు కోల్పోతారు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ భూతం నుంచి ఇప్పుడే బయటపడండి. జీవితం చాలా పెద్దదని గుర్తించండి. ఇప్పుడే ఈ మహమ్మారి నుంచి బయటపడండి.
ఇప్పటికే మీరు ఈ డిజిటల్ ట్రాప్ లో ఇరుక్కుని ఉంటే మెడిటేషన్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలదని మానసిక నిపుణులు చెప్తున్నారు. ధ్యానం మీ మనసుకు స్వాంతన చేకూరుస్తుంది. స్లో లివింగ్ లైఫ్ వల్ల కలిగే ప్రశాంతతను అందిస్తుంది. ఆ క్షణంలో బ్రతకడం ఎలాగో నేర్పుతుంది. మళ్లీ మీ మూలాలను మీరు కనుగొనేలా చేస్తుంది.