Pest Control: వర్షాకాలంలో ధాన్యాలకు పురుగు పట్టకుండా.. సులభమైన 6 ఇంటి చిట్కాలు!

ఇంటిని, ముఖ్యంగా వంటగదిని చూసుకోవడం అంటే చాలా పని. సరకులను జాగ్రత్తగా నిల్వ ఉంచడం ఇల్లాలికి ఓ పెద్ద సవాల్. వర్షాకాలంలో అందరినీ వేధించే ప్రధాన సమస్య పప్పులు, బియ్యానికి పురుగు పట్టడం. తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల ధాన్యాలలో తేమ పెరిగి, పురుగులు, బూజు వృద్ధి చెందుతాయి. ఈ పురుగులను తొలగించడం కష్టమైన పని. అయితే, కొన్ని సులువైన ఇంటి చిట్కాలతో మీ ధాన్యాలకు పురుగులు పట్టకుండా జాగ్రత్త పడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Pest Control: వర్షాకాలంలో ధాన్యాలకు పురుగు పట్టకుండా.. సులభమైన 6 ఇంటి చిట్కాలు!
Pulses And Rice From Insects

Updated on: Jul 26, 2025 | 11:44 AM

వర్షాకాలంలో పప్పులు, బియ్యం పురుగు పట్టడం సాధారణ సమస్య. తగినంత సూర్యరశ్మి లేకపోవడం దీనికి కారణం. అయితే, కొన్ని సులభమైన చిట్కాలతో ఈ పురుగుల బెడదను శాశ్వతంగా నివారించవచ్చు.

ఎండలో ఆరబెట్టండి: వర్షాకాలంలో ఎండ వచ్చినప్పుడు ముందుగా చేయాల్సిన పని, పప్పుధాన్యాలను, బియ్యాన్ని బాగా ఆరబెట్టడం. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న తేమ పూర్తిగా తొలగిపోతుంది. తేమ ఉంటేనే పురుగులు పెరుగుతాయి. పురుగులు పట్టినట్లయితే కూడా వాటిని ఎండలో ఆరబెట్టడం ద్వారా అవి మాయమవుతాయి.

సరిగ్గా నిల్వ చేయండి: చాలా మంది పప్పు ధాన్యాలను స్టీల్ లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తారు. కానీ తేమ వాటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ధాన్యాలను ఎల్లప్పుడూ గాలి చొరబడని (ఎయిర్‌టైట్) పాత్రలలో నిల్వ చేయాలి. ఇది పురుగులు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఫంగస్ కూడా వాటిని ఇబ్బంది పెట్టదు. ఎల్లప్పుడూ చల్లని, పొడి ప్రదేశాలలో వీటిని ఉంచడానికి ప్రయత్నించండి.

పసుపు కలిపండి (ముఖ్యంగా పెసలకు): పప్పుధాన్యాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మీరు పెసలు వంటి పప్పులను నిల్వ చేస్తుంటే, వాటికి ఖచ్చితంగా పసుపు కలపండి. పసుపు సువాసన కీటకాలను ధాన్యాల నుంచి దూరంగా ఉంచుతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపును పెసల్లో కలిపితే మంచి ఫలితం ఉంటుంది.

ఎండిన వేపాకుల ట్రిక్: బియ్యం, పప్పులను పురుగుల నుంచి కాపాడటానికి ఎండిన వేపాకులు ఒక అద్భుతమైన మార్గం. బియ్యం లేదా పప్పులు నిల్వ చేసే డబ్బాల్లో కొన్ని ఎండిన వేపాకులను ఉంచండి. వాటి వాసనకు కీటకాలు దూరంగా ఉంటాయి. ఒకవేళ పట్టినా ఆ వాసనను తట్టుకోలేక బయటకు పారిపోతాయి. వేపాకులు తడిగా ఉండకుండా చూసుకోవడం ముఖ్యం.

ఎర్ర మిరపకాయలు, వెల్లుల్లి ట్రిక్: కందిపప్పు, మినపప్పు వంటివి ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేయండి. వెల్లుల్లి వాసన పురుగులకు పడదు. కావాలంటే, ఎండిన ఎండుమిర్చిని కూడా వేయవచ్చు. వీటిలోని ఘాటు వాసన కీటకాలను దూరంగా ఉంచుతుంది. లవంగాల వాసన కూడా ఇదే విధంగా పనిచేస్తుంది.

బిర్యానీ ఆకులు, నిమ్మ తొక్కలు, అగ్గిపుల్లలు: కందిపప్పు, మినపప్పు, పెసలు నిల్వ చేసేటప్పుడు బిర్యానీ ఆకులను జోడించండి. బిర్యానీ ఆకుల సువాసన చాలా బలంగా ఉంటుంది. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పప్పుధాన్యాలకు జోడించవచ్చు. నిమ్మగడ్డి ఉన్నా కూడా పప్పుధాన్యాలు ఎక్కువ కాలం చెడిపోవు. వింతగా అనిపించినా, అగ్గిపుల్లలను కూడా పప్పుల్లో ఉంచితే కీటకాలు దూరంగా ఉంటాయి. అగ్గిపుల్లల్లో ఉండే సల్ఫర్ కీటకాలను నిరోధిస్తుంది.