సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఇకపై ఆ తప్పుడు చేయకండి..

Rice Bran Oil vs Sunflower Oil: వంటింట్లో పోపు వేయాలన్నా, డీప్ ఫ్రై చేయాలన్నా నూనె లేనిదే పని కాదు. అయితే మార్కెట్‌లో దొరికే వందలాది ఆయిల్ బ్రాండ్లలో.. మీ గుండెకు ఏది మేలు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దశాబ్దాలుగా మనం వాడుతున్న సన్ ఫ్లవర్ ఆయిల్, మరోవైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన రైస్ బ్రాన్ ఆయిల్.. ఈ రెండింటిలో అసలైన హెల్త్ బాస్ ఏది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సన్ ఫ్లవర్ Vs రైస్ బ్రాన్ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..? ఇకపై ఆ తప్పుడు చేయకండి..
Rice Bran Oil Vs Sunflower Oil

Updated on: Apr 19, 2026 | 6:47 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. మనం తినే ఆహారం కంటే ఆ ఆహారాన్ని దేనితో వండుతున్నాం అనేదే మన ఆరోగ్యాన్ని శాసిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ఎంపికలో గందరగోళం మొదలైంది. ఒకప్పుడు కేవలం వేరుశనగ నూనెకే పరిమితమైన మనం.. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న రకరకాల నూనెలను చూసి ఏది మంచిదో తేల్చుకోలేకపోతున్నాం. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మంచిదని ప్రచారం పొందుతున్న రైస్ బ్రాన్ ఆయిల్, దశాబ్దాలుగా మన వంట గదుల్లో రాజ్యమేలుతున్న సన్ ఫ్లవర్ ఆయిల్ మధ్య ఏది మంచిది అనేది తెలుసుకుందాం..

రైస్ బ్రాన్ ఆయిల్ – గుండెకు శ్రీరామరక్ష

రైస్ బ్రాన్ ఆయిల్‌ను వరి పొట్టు పైన ఉండే తవుడు పొర నుండి సేకరిస్తారు. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఒరిజానోల్ అనే అరుదైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారికి వైద్యులు రైస్ బ్రాన్ ఆయిల్‌ను మొదటి ప్రాధాన్యతగా సూచిస్తారు. అంతేకాకుండా దీనిలో ఉండే విటమిన్-E, ఇతర పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్త నాళాలు సాఫీగా పనిచేయడానికి దోహదపడతాయి.

సన్ ఫ్లవర్ ఆయిల్

పొద్దుతిరుగుడు గింజల నుండి తీసే సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. ఇందులో విటమిన్-E పుష్కలంగా ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైన బహుళ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కణాల పునరుత్పత్తిలో దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడతాయి. అయితే ఇందులో ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మోతాదు మించితే శరీరంలో వాపులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వంట చేసే విధానం – స్మోక్ పాయింట్

నూనె ఎంపికలో కీలకమైన అంశం దాని స్మోక్ పాయింట్. అంటే నూనెను వేడి చేసినప్పుడు అది ఏ ఉష్ణోగ్రత వద్ద విచ్ఛిన్నమై పొగగా మారుతుందో చూసుకోవాలి. రైస్ బ్రాన్ ఆయిల్ స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ. అంటే దీన్ని ఎక్కువ వేడి మీద డీప్ ఫ్రై చేసినా హానికరమైన రసాయనాలు విడుదల కావు. పైగా ఆహారం తక్కువ నూనెను పీల్చుకుంటుంది. అదే సన్ ఫ్లవర్ ఆయిల్‌ను పదే పదే మరిగిస్తే, అది తన సహజ గుణాలను కోల్పోయి ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి డీప్ ఫ్రైయింగ్ పనులకు రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్తమమైనది.

ఏది వాడాలి..?

శాస్త్రీయ కోణంలో చూస్తే రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉండే ఒరిజానోల్, హై స్మోక్ పాయింట్ దీనికి కొంత అదనపు బలాన్ని ఇస్తాయి. అయితే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా తక్కువ ఉష్ణోగ్రతతో చేసే వంటలకు చాలా మంచిది. ఆరోగ్య నిపుణులు ఇచ్చే బెస్ట్ సలహా ఏమిటంటే ఆయిల్ రొటేషన్. అంటే మీ వంటింట్లో ఎప్పుడూ ఒకే నూనెను వాడకుండా.. ఒక నెల రైస్ బ్రాన్, ఒక నెల సన్ ఫ్లవర్ లేదా వేరుశనగ నూనెలను మార్చి మార్చి వాడటం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అలాగే ఏ నూనె అయినా సరే రోజుకు గరిష్టంగా 3 నుండి 4 చెంచాలకు మించకుండా చూసుకోవడమే అసలైన ఆరోగ్య రహస్యం.

Follow Us