
ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అయ్యాయి. అయినా సరే నేటికీ అత్తా కోడలు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవంగా ప్రతి ఇంట్లో అత్త, కోడలు మధ్య తరచుగా గొడవలు జరుగడం అనేది సర్వసాధారణం.. అత్తగారి మాటలు, ప్రవర్తన కోడలిని బాధపెడితే, కోడలు ప్రవర్తన అత్తగారికి కోపం తెప్పిస్తుంది. అందుకే, వంట, ఇంటి పని వంటి చిన్న విషయాలకు అత్తగారి, కోడలి మధ్య గొడవలు, వాదనలు కొనసాగుతాయి. కొన్నిసార్లు ఈ చిన్న గొడవలు వీధి పోరాటాలుగా కూడా మారతాయి. అలాంటి పరిస్థితిలో కోడలు కొన్ని చిట్కాలను పాటిస్తే అత్తా కోడలి మధ్య గొడవలు ఉండవు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కనుక ఈ రోజు కోడలు తన అత్తగారితో గొడవ పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చూద్దాం.
తప్పులను అర్థం చేసుకుని ముందుకు సాగండి: కోడలు ఏదైనా తప్పు చేస్తే అత్తగారు ఖచ్చితంగా కోపంగా ఉంటారు. ఈ సందర్భంలో తప్పులను ఎత్తి చూపిన అత్తగారిపై కోపంగా ఉండే బదులు కోడలు తాను చేసిన తప్పులు ఏమిటి అనేది గుర్తించడానికి ప్రయత్నించాలి. తన తప్పులని కోడలు సమర్థించుకునే బదులు తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కోడలు, అత్తగారు కూర్చుని సమస్యకు పరిష్కారం కనుగొంటే వివాదాలే ఏర్పడవు.
భర్తకు ప్రతి చిన్న విషయం చెప్పకండి: కొంతమంది కోడళ్ళు తమ అత్తగారిపై ఫిర్యాదు చేస్తూ.. ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల గురించి కూడా భర్తలకు చెబుతారు. ప్రతిరోజూ ఇలాగే చెబుతూ ఉంటే.. తల్లీ కొడుకుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అదనంగా కొడుకును తల్లి నుంచి దూరం చేసిన కోడలు అనే ఆరోపణలు వస్తాయి. కనుక అత్త కోడలి సమస్యలను ఎప్పుడూ భర్త వరకూ తీసుకుని వెళ్ళకుండా ఇద్దరూ కూరుని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోండి.
ప్రతిదానికీ కోపం తెచ్చుకోకండి: కొంతమందికి అత్తగారు ఏమి చెప్పినా కోపం వస్తుంది. పెద్దలు ప్రతిదీ మీ మంచి కోసమే చెబుతారు. అయితే వారు చెప్పే విధానం కొంచెం కఠినంగా ఉండవచ్చు. కనుక అత్తగారు చెప్పిన వాటిపై కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అత్తగారు ఏమి చెప్పినా ప్రతిదానికీ కోపం తెచ్చుకునే బదులు అలా ఎందుకు చెప్పారు అని ప్రశాంతంగా ఆలోచించండి. అప్పుడు కోడలు, అత్తగారికి మధ్య ఉద్రిక్తత తగ్గుతుంది.
కోపంగా మాట్లాడకండి: అత్తగారు ఏదైనా చెప్పిన వెంటనే ఆమెపై విరుచుకుపడకండి. అలా చేయడం వల్ల గొడవ మరింత తీవ్రమవుతుంది. కనుక అత్తగారు ఏమి చెప్పినా కోపం తెచ్చుకోకండి. ప్రశాంతంగా ఉండడం వలన మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకోండి: ముందుగా కోడలు అత్తమామలను తన తల్లిదండ్రుల్లా చూసుకోవడం ప్రారంభించండి. అత్తమామలను మీ తల్లిదండ్రుల్లా చూసుకోవడం ప్రారంభించినప్పుడు, సగం తగాదాలు ముగుస్తాయి. ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)