
అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాన్ని చాటిచెప్పే ఈ పవిత్ర పండుగ సందర్భంగా, సోదరి తన సోదరుడి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కాంక్షిస్తూ చేతికి రాఖీని కడుతుంది. ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆమెకు రక్షణగా నిలుస్తానని సోదరుడు అండగా ఉండేందుకు భరోసా ఇస్తాడు. కేవలం రాఖీ కట్టడానికే పరిమితం కాకుండా కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేసే ప్రత్యేకమైన వేడుకగా ఇది నిలుస్తుంది. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటల వరకు కొనసాగుతుంది. హిందూ సంప్రదాయంలో పండుగలను నిర్ణయించేందుకు ఉదయ తిథి ప్రామాణికం కాబట్టి రక్షాబంధన్ వేడుకను ఆగస్టు 28న జరుపుకోవాలని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పర్వదినం సందర్భంగా సమయాల పరంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆగస్టు 28న ఉదయం 8:04 నుండి 11:22 గంటల వరకు చంద్రగ్రహణం ఉంది. అయితే ఇది భారత దేశంలో కనిపించదు. కాబట్టి సూతకాలం పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. కాగాస్థానిక పంచాంగ నియమాలు, గ్రహణ నియమాలను అనుసరించి వేడుకలు నిర్వహించుకోవాలి. ఇక భద్రకాలం ఆగస్టు 27న ఉదయం 9:08 నుండి 9:32 గంటలకే ముగిసిపోతుంది కాబట్టి ఆగస్టు 28న రాఖీ కట్టేందుకు భద్రకాల ఆటంకం ఉండదు. అలాగే శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రాహుకాలం ఉండటంతో స్థానిక సమయాలకు అనుగుణంగా శుభ సమయాన్ని ఎంచుకోవడం మంచిది.
శ్రావణ పౌర్ణమికి దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల్లో విశిష్ట స్థానం ఉంది. పశ్చిమ తీరంలో జాలర్లు వరుణ దేవుడికి కొబ్బరికాయలు సమర్పించి నారలి పూర్ణిమగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ఉపాకర్మ నిర్వహిస్తారు. మధ్య భారతదేశంలో వ్యవసాయ వర్గాలు మంచి దిగుబడిని ఆశిస్తూ కజ్రీ పూర్ణిమగా పూజిస్తారు. ప్రకృతిలో మార్పులతో పాటు అంతర్గత శుద్ధితో నూతనోత్తేజాన్ని పొందేందుకు, బాధ్యతలు, పరస్పర రక్షణను గుర్తుచేసుకునేందుకు ఈ రక్షాబంధన్ ఒక గొప్ప ఆధ్యాత్మిక వేదికగా నిలుస్తుంది.