
హాయిగా వందేళ్లు బతకాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. దానిని కాపాడుకోవడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం రోజూ చేసే పనులే సరిగ్గా చేస్తే సరిపోతుంది. అందుకు ప్రతిరోజూ యోగా, వ్యాయామం, ధ్యానం చేయడంతో పాటు మంచి ఆహారాన్ని అనుసరించడం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఆహారాలలో గుమ్మడికాయ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కానీ చాలా మందికి దీని గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల, గుమ్మడిని ఆహారంలో తీసుకోవడంలో పెద్దగా శ్రద్ధ చూపరు. కొన్ని ప్రదేశాలలో చైనీస్ గుమ్మడికాయగా పలిచే తీపి గుమ్మడికాయ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఇది పోషకాలతో సమృద్దిగా నిండి ఉంటుంది. ముఖ్యంగా ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
తీపి గుమ్మడికాయ లేదా ఎర్ర గుమ్మడికాయ పోషకాలు అధికంగా ఉండే కూరగాయ. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే, ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాదు, ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, తీపి గుమ్మడికాయ గింజల వినియోగం ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని పోషకాలు సాధారణంగా ప్రోస్టేట్ గ్రంథిని బలోపేతం చేయడానికి, పురుషులలో ఆరోగ్యకరమైన హార్మోన్ల పనితీరును ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.
తీపి గుమ్మడికాయలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది.
తీపి గుమ్మడికాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
దీనిలోని పొటాషియం, కరిగే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తీపి గుమ్మడికాయ గింజలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
తీపి గుమ్మడికాయ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కాబట్టి ఆహారంలో తీపి గుమ్మడికాయను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందన్నమాట. అయితే ఆరోగ్యానికి మంచిదికదాని అవసరమైన దానికంటే ఎక్కువగా తినకపోవడమే మంచిది. మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.