Motivation: ఈ ఒక్క లక్షణం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.. జాగ్రత్త!

ప్రతి మనిషిలో ప్రేమ, ఆనందం, బాధతో పాటు భయం, కోపం వంటి భావోద్వేగాలు ఉంటాయి. అయితే భయం, కోపం, ద్వేషం, ప్రతీకారం లాంటి భావాలు మనకే కాక ఇతరులకు కూడా హానికరం. ముఖ్యంగా ప్రతీకారం మనశ్శాంతిని నాశనం చేసి, ఇతరులకు కష్టాలు కలిగిస్తుంది. అందుకే పెద్దలు ప్రతీకారం ధర్మానికి, సంస్కృతికి విరుద్ధమని చెబుతారు.

Motivation: ఈ ఒక్క లక్షణం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.. జాగ్రత్త!
Revenge

Updated on: Jan 08, 2026 | 10:38 AM

ప్రతి మనిషిలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమ, అప్యాయత, ఆనందం, బాధ, భయం, కోపం ఇవన్నీ సాధారణంగా అందరిలోనూ ఉంటాయి. వీటిలో భయం, కోపం, ద్వేషం, ప్రతీకారం అనేవి తమతోపాటు ఇతరులకు కూడా చెడు చేసే అవకాశం ఉన్న భావోద్వేగ లక్షణాలు. ప్రతీకారం మాత్రం చాలా చెడ్డ భావోద్వేగమనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతీకారం ఉన్న వ్యక్తి తాను ప్రశాంతంగా ఉండటం.. ఇతరులను కూడా ఇబ్బంది పెడతాడు. అందుకే ప్రతీకారం అనేది ధర్మం, సంస్కృతికి విరుద్ధమని పెద్దలు చెబుతుంటారు.

మనకు అన్యాయం చేసిన వారికి హాని చేయాలనే లోతైన సహజమైన భావనే ఈ ప్రతీకారం. కోపం, ప్రతీకారం కోరికగా వ్యక్తమవుతుంది. కానీ, ఇది తరచుగా అపరాధ భావనలకు, మానసిక అశాంతికి దారితీస్తాయి. అందుకే ప్రతీకారం, కోపం లాంటి దుర్గుణాలను ధ్యానం, ధర్మం, స్వీయ నియంత్రణ ద్వారా అధిగమించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

బలహీనులపైనే ప్రతీకారం ఎందుకు?

ప్రతీకారాన్ని దగ్గరగా పరిశీలిస్తే మనకు కొన్ని సత్యాలు అర్థమవుతాయి. మనకంటే బలహీనమైన వారిపైన మాత్రమే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకంటే బలవంతులు ముందు మనం బలహీనులమవుతాం. ప్రతీకారం తీర్చుకోవడానికి సంకోచిస్తాం, భయపడతాం. బలవంతుల మీద ప్రతీకారం తీసుకుంటే కలిగే పరిణామాల గురించి మనం ఆలోచిస్తాం. అది మనకే ఎక్కువ హాని చేస్తుందని తెలిసి ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం విరమించుకుంటారు.

ప్రతీకారంతో జీవితం వృథా

మనకు ఎవరిపైనైనా ద్వేషం లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నప్పుడు.. వారిపై అంతులేని కోపం, ప్రతీకార కోరికతో రగిలిపోతుంటాం. ఇది మనసులో అవాంఛనీయ మార్పులకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళన, నాడీ విచ్ఛిన్నం వంటి మానసిక స్థితులకు గురవుతారు. ఇది మన సామర్థ్యాన్ని తగ్గించడంతోపాటు విలువైన సమయం, జీవితాన్ని వృథా చేస్తుంది. అలాగే, మన విలువను తగ్గించడంతోపాటు ప్రతీకారం తీర్చుకోవడం అనేది మన సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

ప్రతీకారాన్ని వీడితేనే జీవితం

ప్రతీకార స్వభావం మన మనశ్సాంతిని దెబ్బతీయడంతోపాటు సామాజిక వ్యతిరేక ధోరణులను అభివృద్ధి చేస్తుంది. ఇది మీతోపాటు మీకు సంబంధించిన వ్యక్తులపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతీకార స్వభావం అనేది తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వవచ్చు కానీ.. శాశ్వత మనోవేధనకు గురిచేస్తుంది. అంతేగాక, ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఎప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వదు. మనకు ఎవరైనా తెలిసో తెలియకో చేసిన తప్పులను క్షమించడం మంచిదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీకారాన్ని వదిలించుకోవడంతోపాటు సహనాన్ని పాటించడం, క్షమించే వైఖరిని అలవాటు చేసుకుంటే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. సానుకూల స్వభావాలతో మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెబుతున్నారు.