
మనల్ని బాగా వేధించే జుట్టు సమస్యల్లో చుండ్రు (Dandruff) కూడా ఒకటి. అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార లేమీ, కాలుష్యం తదితర కారణాలతో చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే తలలో దురద, వెంట్రుకలు పొడిబారడం, హెయిర్ పాల్ (Hair fall) వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. చుండ్రును వదిలించుకునేందుకు మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులున్నా అవి ఎంత మేర ప్రయోజనం చేకూరుస్తాయో తెలియదు. పైగా వాటిలోని రసాయనాల వల్ల ఒక్కోసారి దుష్ర్పభావాలు ఎదురుకావచ్చు. అందుకే వీటి బదులు అనేక రకాల హోం రెమెడీస్ ( నేచురల్ హెయిర్ ఆయిల్స్ ) ప్రయత్నించవచ్చు. కొబ్బరి నూనె (Coconut oil), ఆలివ్ నూనె, ఆముదం, వేప నూనె మొదలైనవి చుండ్రును తగ్గించి జుట్టుకు పోషణను అందిస్తాయి. వీటిని ఇతర పదార్థాలతో కలిపి హెయిర్ మాస్క్‌లను కూడా తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.
నిమ్మరసం, కొబ్బరి నూనె..
అర టీస్పూన్ తాజా నిమ్మరసంలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీనిని తలకు పట్టించి చేతులతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. సుమారు 30 నుండి 40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి 2 నుండి 3 సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
ఆలివ్ ఆయిల్, పెరుగు..
పావు కప్పు పెరుగు తీసుకోండి. దానికి 1 నుంచి 2 టీస్పూన్ల ఆలివ్ నూనె జోడించండి. దీన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్యలు తగ్గిపోవడంతో పాటు జుట్టు మృదువుగా మారుతుంది.
వేప నూనె, నిమ్మరసం..
ఒక నిమ్మకాయ తీసుకుని దానిని సగానికి కట్ చేయాలి. అనంతరం రసం తీసి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వేప నూనెను కలపండి. దీనిని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి జుట్టును కడిగేసుకోవాలి. వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.
ఉల్లిపాయ రసం
2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసంలో 2-3 టేబుల్ స్పూన్ల ఆముదం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు రాసుకోవాలి. అవసరమైతే మృదువుగా మసాజ్ కూడా చేసుకోవచ్చు. 30 నుండి 40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. తరుచుగా ఈ మిశ్రమాన్ని జట్టుకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా కురులు మిలమిల మెరుస్తాయి.