AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలం ఇదొక్క పనిచేస్తే జామకాయలు గుత్తులు గుత్తులుగా విరగకాస్తాయ్..

వర్షాకాలంలో జామ చెట్టుకు కాపు పూర్తైన కొమ్మలను సరిగ్గా కత్తిరించడం వల్ల కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి. ఈ కొత్త చిగుర్ల నుంచే ఎక్కువ పూత, అధిక దిగుబడి లభిస్తుంది. ఆవు పేడ, వేప పిండి, అరటి తొక్కల పొడి వంటి సేంద్రీయ ఎరువులు వేయడం, వేర్ల వద్ద నీరు నిల్వ కాకుండా చూడడం, వేపనూనె పిచికారీ చేయడం ద్వారా జామ చెట్టు ఆరోగ్యంగా పెరిగి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుందని గార్డెనింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలం ఇదొక్క పనిచేస్తే జామకాయలు గుత్తులు గుత్తులుగా విరగకాస్తాయ్..
Guava Tree Care Tips
Shaik Madar Saheb
|

Updated on: Jun 18, 2026 | 1:51 PM

Share

చాలా మంది ఇళ్లల్లో జామ చెట్టు ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ తియ్యటి జామపళ్లను ఇష్టంగా తింటారు. జామకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. అందుకే.. ప్రతీ ఒక్కరూ వీటిని ఇష్టపడతారు. అయితే.. జామ చెట్టును పెంచేవారికి అధిక దిగుబడిని సాధించడం ఒక లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక కీలకమైన పద్ధతి ఉంది.. అది కాపు అయిపోయిన తర్వాత చెట్టు కొమ్మలను సరిగ్గా కత్తిరించడం. వర్షాకాలంలో ఈ ప్రక్రియ చేయడం వల్ల జామ చెట్టు గుత్తులు గుత్తులుగా కాయలను అందిస్తుంది. దీంతోపాటు.. సేంద్రీయ ఎరువులను కూడా అందించడం వల్ల.. జామకాయలు విరగకాస్తాయని గార్డెనింగ్ నిపుణులు చెబుతున్నారు.

సమర్థవంతమైన కొమ్మల కత్తిరింపు పద్ధతి

జామ చెట్టుకు కాయలు కాసిన తర్వాత, ఆ కొమ్మలు వాటి కార్యాన్ని పూర్తి చేసుకుంటాయి. ఇలాంటి కొమ్మలను అలాగే ఉంచడం వల్ల చెట్టుకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, అవి కొత్త కాయలు కాయవు. కాబట్టి, జామకాయలు కోసిన తర్వాత, కాపు అయిపోయిన కొమ్మలను గుర్తించి, వాటిని కత్తిరించాలి. ఈ కత్తిరింపు ప్రక్రియ చెట్టుకు కొత్త చిగుళ్లు రావడానికి దోహదపడుతుంది. ఈ కొత్త చిగుర్ల నుండే పుష్కలంగా పూత, ఆ తర్వాత అధిక సంఖ్యలో పిందెలు, కాయలు వస్తాయి.

వర్షాకాలం ప్రారంభంలో కొమ్మల కత్తిరింపునకు ప్రత్యేకమైన కత్తిని ఉపయోగించవచ్చు.. ఇది పెద్ద కొమ్మలను సులభంగా కత్తిరించడానికి సహాయపడుతుంది. చిన్న కొమ్మలను ఇంట్లో దొరికే కత్తెరతో కూడా కత్తిరించవచ్చు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.

కాయలు కాసి, పండిపోయిన కొమ్మలను మాత్రమే కత్తిరించాలి.

పూత ఉన్న కొమ్మలను, లేదా పిందెలు ఉన్న కొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు. వాటిని పండ్లు పండి, కోతకు వచ్చిన తర్వాతే కత్తిరించాలి.

కొమ్మలను కత్తిరించిన ప్రదేశం నుండి కొత్తగా చిగుర్లు వచ్చి, అవి పెరిగి, మళ్లీ కాయలు కాస్తాయి. ఇది నిరంతర ప్రక్రియ.

జామ చెట్టు ప్రూనింగ్ తప్పనిసరిగా చేయడంతోపాటు.. పాటు ఆవు పేడ, వేప పిండి, అరటి తొక్కల పొడి వంటి సేంద్రీయ ఎరువులను అందించడం ద్వారా చెట్టుకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అప్పుడు జామకాయలు బాగా కాస్తాయని చెబుతున్నారు.

జామ చెట్లకు తేమ అవసరమే కానీ.. వేర్ల దగ్గర ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకూడదు. నీరు నిలిస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.. నీరు నిల్వ ఉంటే.. వెంటనే తీయాలి..

వర్షాకాలంలో పురుగులు లేదా తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వీటిని నివారణ కోసం వేప నూనెను (నీమ్ ఆయిల్) పిచికారీ చేయడం ఉత్తమం.

ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల జామ చెట్టు నిరంతరం ఫలాలను అందిస్తుంది. తైవాన్ జామ వంటి రకాలకు కూడా ఈ కత్తిరింపు పద్ధతి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అధిక దిగుబడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us