
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2023 సంవత్సరంలో భారతదేశంలో 20 లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, 2024 సంవత్సరంలో దేశంలో మొత్తం 2,33,400 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మన దేశంలో దోమల బెడద ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయి. దీంతో నిద్రకు భంగం కలిగడమే కాదు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులను వ్యాపిజేస్తాయి.
సాధారణంగా దోమలను తరిమికొట్టడానికి చాలా మంది మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే, కొంత కాలం తర్వాత దోమలు వాటికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటాయి. అదే సమయంలో ఈ ఉత్పత్తులలో ఆరోగ్యానికి చాలా హాని కలిగించే అనేక రసాయనాలు ఉంటాయి. వీటిని ఎక్కువసేపు వాడటం వల్ల తలనొప్పి, కంటి చికాకు, శ్వాసకోశ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. కనుక ఈ రోజు ఇంట్లో దోమలను తరిమికొట్టే సహజ మార్గాల గురించి తెలుసుకుందాం..
సుగంధ నూనెలు: కొన్ని రకాల నూనెలు దోమలను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటాయి. లావెండర్, టీ ట్రీ, వేప, సిట్రోనెల్లా, యూకలిప్టస్ , పిప్పరమెంటు నూనె వంటివి. ఈ నూనెలలో దేనినైనా తీసుకొని, నీటిలో కొద్దిగా కలిపి ఇంట్లో పిచికారీ చేయండి. అంతేకాదు దోమల సమస్యకు ఉపశమనం కోసం వేపనూనె మరింత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు.
కర్పూరం: తెరిచి ఉన్న పాత్రలో కొన్ని కర్పూరం ముక్కలను ఉంచండి. దీని సువాసన దోమలను దూరంగా ఉంచుతుంది. దోమలు ఎక్కువగా ఉంటే గది తలుపులు, కిటికీలను మూసివేసి 20 నిమిషాలు కర్పూరం వెలిగించండి. దీంతో దోమలు పారిపోతాయి. లేదా ఒక గిన్నెలో నీరు వేసి కర్పూరం వేసి ప్రతి 2-3 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. దీని ఘాటైన వాసన దోమలను దూరంగా ఉంచుతుంది.
వెల్లుల్లి: దోమలకు వెల్లుల్లి వాసన నచ్చదు. దోమలను తరిమికొట్టడానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటిలో ఉడకబెట్టి.. ఆ నీటిని చల్లబరచండి. తర్వాత ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి అంతటా స్ప్రే చేయండి. ఈ వాసన కారణంగా దోమలు ఇంట్లోకి రావు.
నిమ్మకాయ, లవంగాలు: ఒక నిమ్మకాయను తీసుకొని దానిని కోసి నిమ్మ చెక్క మీద లవంగాలను అతికించి, ఇంట్లోని వివిధ మూలల్లో ఉంచండి. లేదా లవంగాలను నిమ్మరసంలో నానబెట్టి గదిలోని వివిధ ప్రదేశాలలో ఉంచండి. దీనివల్ల దోమలు గదిలోకి రావు.
దోమలు కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే వాసనని ఇష్టపడవు. తులసి, పుదీనా, నిమ్మగడ్డి వంటి మొక్కలను ఇంట్లో, ప్రాంగణంలో, బాల్కనీలో పెంచుకోండి. గదిలోని కుండీలలో ఈ మొక్కలు ఉంచవచ్చు. ఈ మొక్కలను పెంచుకుంటే దోమలు ఇంట్లోకి రావు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)