వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే అద్భుత చిట్కాలు ఇవే..
వర్షాకాలం తెచ్చే చల్లటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నా.. దాంతో పాటే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు కూడా సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తాయి. చాలా మంది ఉదయం నిద్ర లేవగానే గొంతులో గరగర, మింగేటప్పుడు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. గాలిలో పెరిగే బ్యాక్టీరియా, తేమ వల్లే ఈ సమస్య వస్తుంది. అయితే ఇంట్లోనే ఉండి గొంతు నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుతమైన చిట్కాలు తెలుసుకుందాం..

వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తూ వచ్చే వర్షాకాలం అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ఆరోగ్య పరంగా చూస్తే ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. నేలపై పడే మొదటి వర్షపు జల్లులు, మట్టి వాసన మనసుకు ఎంత హాయినిస్తాయో.. ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు అంతకంటే ఎక్కువ ముప్పును తెచ్చిపెడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో గొంతు ఇన్ఫెక్షన్లు రావడం చాలా సర్వసాధారణం. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నస్టిక్ రీసెర్చ్ ప్రకారం.. మిగతా కాలాలతో పోలిస్తే రుతుపవనాల సమయంలోనే గొంతు నొప్పి కేసులు విపరీతంగా పెరుగుతాయని తేలింది. అసలు వర్షాకాలంలోనే గొంతు చికాకు ఎందుకు పెరుగుతుంది? ఉదయాన్నే వచ్చే గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
వర్షాకాలంలో గొంతు నొప్పికి 5 ప్రధాన కారణాలు..
గాలిలో నిరంతరంగా ఉండే తేమ , ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల గొంతులో గీరుకుపోయినట్లు అనిపించడం, మింగేటప్పుడు సూదులతో గుచ్చినట్లు నొప్పి రావడం జరుగుతుంది. దీని వెనుక 5 ముఖ్య కారణాలు ఉన్నాయి.
వైరల్ ఇన్ఫెక్షన్: ఈ కాలంలో జలుబు, ఫ్లూ కలిగించే వైరస్‌లు గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపిస్తాయి.
బ్యాక్టీరియా సంక్రమణ: వాతావరణంలో తేమ పెరగడం వల్ల స్ట్రెప్టోకోకస్ పైయోజెనెస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది తీవ్రమైన గొంతు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
అలర్జీలు: గాలిలో తేమ వల్ల దుమ్ము, పుప్పొడి రేణువుల శాతం పెరిగి అలర్జీలు వస్తాయి. దీనివల్ల ముక్కు నుండి గొంతులోకి శ్లేష్మం చేరి చికాకు పుడుతుంది.
వాయు కాలుష్యం: వర్షం పడేటప్పుడు గాలిలో ఉండే ధూళి కణాలు కిందికి రావడం వల్ల గొంతు గరగరలాడుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తేమ వల్ల వచ్చే ఫంగస్ ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి.
గొంతు నొప్పుంటే.. చేయాల్సిన 5 పనులు..
ఒకవేళ మీరు లేదా మీ ఇంట్లో వారు ఉదయాన్నే గొంతు నొప్పితో నిద్రలేస్తే ఆందోళన పడక్కర్లేదు. ఇంట్లోనే ఉండి ఉపశమనం పొందే 5 బెస్ట్ చిట్కాలు ఇవి..
గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం: ఇది అన్నిటికంటే సులభమైన, సూపర్ హిట్ పద్ధతి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు వేసి రోజుకు 2-3 సార్లు పుక్కిలిస్తే గొంతు వాపు, మంట వెంటనే తగ్గుతాయి.
తేనె – గోరువెచ్చని నీరు: ఒక గ్లాసు వెచ్చని నీటిలో లేదా హెర్బల్ టీలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి. తేనెలో ఉండే సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతాయి.
ఎక్కువ నీరు తాగడం: గొంతు పొడిబారితే నొప్పి మరింత పెరుగుతుంది. అందుకే రోజంతా అప్పుడప్పుడు గోరువెచ్చని నీరు, సూప్ లేదా హెర్బల్ టీ తాగుతూ గొంతును తేమగా ఉంచాలి.
వేడి నీటి ఆవిరి పట్టడం: ఉదయాన్నే ఆవిరి పట్టడం వల్ల గొంతు నొప్పితో పాటు ముక్కు దిబ్బడ నుండి కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
గొంతుకు విశ్రాంతి ఇవ్వడం: గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడటం లేదా గొంతుపై ఒత్తిడి పెట్టడం చేయకూడదు. కొద్దిసేపు మాట్లాడటం తగ్గించి గొంతుకు రెస్ట్ ఇవ్వాలి.
గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ అలవాట్లు మార్చుకోండి..
చల్లటి పదార్థాలకు నో: ఉదయాన్నే లేవగానే ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని నీరు లేదా డ్రింక్స్ అస్సలు తాగకూడదు.
ఆవిరిలో చిన్న ట్రిక్: ఆవిరి పట్టేటప్పుడు నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేస్తే శ్వాసనాళం క్లియర్ అవుతుంది.
మరీ వేడిగా వద్దు: టీ లేదా కాఫీని మరీ నోరు కాలేంత వేడిగా తాగకూడదు. ఇది గొంతు లోపలి సున్నితమైన పొరను దెబ్బతీస్తుంది. మితమైన వేడితో తాగాలి.
బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయొద్దు: ఉదయపు ఆహారంలో పసుపు పాలు, తేనె, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
చేతుల పరిశుభ్రత: అన్నిటికంటే ముఖ్యం.. బయటి నుంచి రాగానే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడటం చాలా మంచిది.
