
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే బాడీ ఫిట్‌గా ఉండాల్సిందే. అది హీరోలైనా, హీరోయిన్లైనా. అందుకే హీరోహీరోయిన్లందరూ వ్యాయామం, యోగా, డైట్ వంటి వాటిని వారి డైలీరొటీన్లో తప్పకుండా ఉండేలా జాగ్రత్తపడతారు. అయినప్పటికీ జీన్స్ కారణంగా, వయస్సు రీత్యా, ఆరోగ్య సమస్యల మూలంగా కొందరు సెలబ్రిటీలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారు. అయితే కఠినమైన వ్యాయామం, డైట్ చేసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు చాలా కష్టపడతారు.
అయితే చాలామంది హీరోయిన్లు బరువు తగ్గే క్రమంలో తాము పడే కష్టాన్ని అభిమానులతో పంచుకుంటూ జిమ్ ఫొటోలు, సిక్స్-ప్యాక్ ట్రైనర్ సెల్ఫీలు, గ్రీన్ జ్యూస్ గ్లాస్‌లు పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తుంటారు. కానీ ఒక బాలీవుడ్ బ్యూటీ మాత్రం ఏ జిమ్ డోర్ తెరవకుండా, ఎవరినీ డైటీషియన్‌గా పెట్టుకోకుండా, ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా లేకుండా సైలెంట్‌గా 20 కేజీలు తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె ఫొటోలు చూస్తే ‘ఇది ఆమెనా?’ అని ఆశ్చర్యం కలుగుతోంది. జిమ్‌కి అడుగుపెట్టకుండానే 20 కేజీలు తగ్గిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..
అది ఎవరో కాదు.. తన ప్రతిభతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విద్యాబాలన్. రెండు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యాబాలన్. బాలీవుడ్లో స్టార్ నటిగా రాణిస్తూనే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఎన్టీఆర్- కథానాయకుడు’, ‘ఎన్టీఆర్- మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇటు సినిమాలు, అటు వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న విద్యాబాలన్ చాలా రోజులుగా ఒబేసిటీతో బాధపడుతున్నారు.
ఇన్ఫ్లమేషన్ కారణంగా తన శరీరం తరచుగా అధిక బరువు సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని విద్యాబాలన్ చాలా ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. అయితే తాజాగా తను ఎలాంటి జిమ్‌కి వెళ్లకుండా 20 కేజీలు తగ్గానని చెప్పుకొచ్చారు. ‘ఎవరూ నమ్మరు… నేను జిమ్‌కి వెళ్లలేదు, డైటీషియన్‌ని కలవలేదు, ఎక్సర్‌సైజ్ రొటీన్ అంటూ ఏమీ లేదు. అయినా 20 కేజీలు కరిగిపోయాయి!’ అంటున్నారు విద్యాబాలన్. ఇంతకీ ఆమె ఫాలో అయిన సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..
అధిక బరువు తగ్గేందుకు విద్యాబాలన్ తన జీవనశైలిలో చేసిన ప్రధాన మార్పు ఆహారం, వ్యాయామం రెండింటినీ సమతుల్యం చేయడం. ఇంట్లోనే యోగా చేసి, ఆహారంపై నియంత్రణ వహించడం వల్ల ఆమెకు జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇది చాలా మందికి ప్రేరణనిచ్చే అంశం. ఇంట్లోనే సరైన పద్ధతులతో బరువు తగ్గడం సాధ్యమేనని ఆమె నిరూపించింది.
జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్ చేయకుండా, విద్యాబాలన్ ప్రతిరోజూ యోగా చేసింది. యోగా ద్వారా ఆమె శరీరం ఫిట్‌గా ఉండడమే కాకుండా, మానసిక శాంతి కూడా లభించింది. ఇది ఆమెకు శారీరకంగా, మానసికంగా బలాన్నిచ్చింది. విద్యాబాలన్ బరువు తగ్గడంలో ఆహారం కీలక పాత్ర పోషించింది. ఆమె తన ఆహారంలో ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకుంటూ, కార్బోహైడ్రేట్‌ను తగ్గించింది. ప్రతీ భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంది.
అంతేకాకుండా, ఆమె రాత్రి 7 గంటల తర్వాత తినడం మానేసింది. ఇది శరీర జీవక్రియను మెరుగుపరిచి, క్రమంగా బరువు తగ్గడానికి దోహదపడింది. తన డైట్ సీక్రెట్స్ గురించి మాట్లాడుతూ రాత్రి 6:30 తర్వాత ఏమీ తినను… ఒక్క గుక్క కూడా కాదు! సూర్యుడు అస్తమిస్తే నా ప్లేట్ క్లోజ్. ఆకలి వేస్తే వెచ్చని నీళ్లు లేదా గ్రీన్ టీ మాత్రమే తాగుతానంటోంది విద్య. ‘రాత్రి 6:30కి డిన్నర్ అయితే, మళ్లీ ఉదయం 10:30–11 వరకు నో ఫుడ్. ఈ గ్యాప్ వల్ల బాడీ ఆటోమాటిక్‌గా ఫ్యాట్ బర్న్ చేస్తుంది. జిమ్ టైమ్ లేదు కాబట్టి ఇంటి చుట్టూ లేదా టెర్రస్ మీద వేగంగా నడుస్తాను.
Vidya Balan In Pink
నీళ్లు ఎక్కువ తాగడం వల్ల వాపులు పోయాయి. ఇప్పుడు నా ప్లేట్‌లో రాగి, జొన్న, ఓట్స్, బ్రౌన్ రైస్ మాత్రమే ఉంటాయి. స్వీట్స్ అంటే ఇష్టమే కానీ ఒక్క ముక్క కూడా తినలేదు. రోజూ 15 నిమిషాలు మెడిటేషన్. కొన్నిసార్లు ఇంట్లో పాట పెట్టుకుని డాన్స్ చేస్తాను. స్ట్రెస్ తగ్గితే బరువు ఆటోమాటిక్‌గా తగ్గుతుంది. నేను బాడీని శిక్షించలేదు… దాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. ఆ ప్రేమ వల్లే ఇవాళ ఇంత ఫిట్‌గా ఉన్నాను’ అంటూ తన ఫిట్నెస్ సీక్రెట్స్ బయటపెట్టింది ఈ బాలీవుడ్ సీనియర్ బ్యూటీ.