
సాధారణంగా భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిదని చెబుతుంటారు. కానీ యోగాలో ఉండే వజ్రాసనం అనే ప్రత్యేకమైన భంగిమ ఈ నమ్మకాన్ని మార్చేస్తుంది. భోజనం చేసిన వెంటనే ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల జీర్ణవ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం.
వజ్రాసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు కాళ్లు, తొడలలో రక్త ప్రవాహం తగ్గి, కడుపు భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ పెరిగిన రక్త ప్రవాహం కడుపు, ప్రేగులు, కాలేయం వంటి జీర్ణ అవయవాలను మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా, ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది.
వజ్రాసనం కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాదు. వెన్నెముకకు కూడా చాలా మంచిది. ఈ భంగిమలో కూర్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటుంది. దీనివల్ల దానిపై ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం సాధన చేస్తే వెన్నెముక, భుజాలు, నడుము కండరాలు బలపడతాయి. ఇది వెన్నునొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
వజ్రాసనం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చే అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలకు కూడా ఈ ఆసనం ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా వజ్రాసనం ఒక మంచి ఎంపిక. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది. మెరుగైన జీవక్రియ అంటే శరీరం ఆహారాన్ని త్వరగా శక్తిగా మారుస్తుంది. ఇది కొవ్వును కరిగించి, కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
భోజనం చేసిన వెంటనే వజ్రాసనంలో కూర్చోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత 5 నుండి 10 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోవడం ఉత్తమం. ఇది ఆహారం వేగంగా, సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..