
పసుపు కేవలం వంటకాలకే పరిమితం కాదు. ఇది అనేక ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంది. భారతీయ సంప్రదాయంలో పసుపు పవిత్రతకు చిహ్నంగా భావించబడుతుంది. ఇందులో ఉండే కర్క్యూమిన్ అనే సహజ పదార్థం శరీరానికి శక్తిని ఇస్తుంది.. దెబ్బలు, వాపులను తగ్గిస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని టాక్సిన్ ల నుండి కాపాడతాయి. ఈ ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే పసుపు పొడిని సరిగ్గా నిల్వ చేయడం తప్పనిసరి. పసుపు పొడిని సురక్షితంగా నిల్వ చేసే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా తీసిన పసుపు కొమ్ముల్లో మట్టితో కలిసిన చెదలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని కొన్న వెంటనే శుభ్రంగా కడగాలి. ముందుగా ఒక బౌల్ నిండా నీటిలో వేసి బాగా కదిలిస్తూ చక్కగా కడగాలి మట్టి పూర్తిగా తొలగేలా చూడాలి. అనంతరం ఆ పసుపు తడి లేకుండా ఉండేలా స్పాంజ్ గానీ.. శుభ్రమైన కాటన్ గానీ ఉపయోగించి తుడవాలి. తడి పూర్తిగా పోయేంత వరకు వర్షంలో లేదా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచకూడదు.
పసుపు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని కాగితం టవల్ తో చుట్టాలి. తర్వాత గాలి చొరబడని ఏర్ టైట్ డబ్బాలో వేసి ఫ్రిజ్ లోని కూరగాయల విభాగంలో నిల్వ చేయాలి. అవసరమైతే ఆ తరువాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి జిప్ లాక్ కవర్ లో పెట్టి ఫ్రీజర్ లో కూడా భద్రపరచవచ్చు. ఇలా చేస్తే పసుపు ఎక్కువ రోజులు నాణ్యతతో ఉండే అవకాశం ఉంటుంది.
పసుపు పొడి లాంటి మసాలా పదార్థాలను ఎప్పటికీ నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. ఎక్కువ వెలుతురు లేదా వేడి ఉన్న ప్రదేశాల్లో ఉంచితే పసుపు తన అసలైన లక్షణాలను కోల్పోతుంది. రంగు మారిపోవచ్చు, దుర్వాసన రావచ్చు. అందుకే పసుపు పొడిని చల్లగా నీడ ఉన్న ప్రదేశంలో ఉంచడం ఉత్తమం.
ఈ సూచనలు పాటిస్తే మీరు ఇంట్లో ఉన్న పసుపు పొడిని.. అలాగే తాజా పసుపును నాణ్యత కోల్పోకుండా ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ఇలా నిల్వ చేయడమే ఉత్తమమైన మార్గం.