
ప్రతి ఇంటి వంటగదిలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి నాణ్యత, తాజాదనం వంట రుచిని, పోషక విలువలను నిర్ణయిస్తుంది. మార్కెట్‌లో సరైన కూరగాయలను ఎంచుకోవడం ఒక కళ.. ఇది కూరగాయల వృథాను తగ్గించి, డబ్బు ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. కూరగాయలో ప్రకాశవంతమైన, నిండు రంగు వంటి తాజాదనం లక్షణాలను తనిఖీ చేయడం అనేది చాలా మందికి తెలియదు.. అయితే.. కూరగాయలను ఎంచుకునేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..
వాస్తవానికి మార్కెట్‌లో తాజా, నాణ్యమైన కూరగాయలను సులభంగా తెలుసుకోవచ్చు.. తాజావి మంచిగా షైనింగ్ తో కనిపిస్తాయి.. వాడిపోయి.. షైనింగ్ లేకుండా కనిపిస్తే.. అవి తాజావి కాదని అర్థం..
ఉల్లిపాయలు: ఉల్లిపాయలు రెండు రకాలుగా ఉంటాయి: కొత్తవి, పాతవి. పాత ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి, నలుపు రంగులో కనిపించే వాటిని ఎంచుకోవడం మంచిది. ఈ నలుపు రంగు పొగ పెట్టడం వల్ల వస్తుంది, అది పాత వాటికి సంకేతం.
బీరకాయలు: లేత బీరకాయలను ఎంచుకోవాలంటే, వాటి రంగు ముదురు ఆకుపచ్చగా ఉండాలి. పెద్ద బీరకాయల కంటే కొంచెం చిన్నగా లేదా పొట్టిగా ఉన్న వాటిని తీసుకుంటే చేదు రాకుండా ఉంటుంది.
సొరకాయలు: సొరకాయ లేతదా కాదా అని తెలుసుకోవడానికి వేలుతో గుచ్చినప్పుడు గోరు లోపలికి దిగాలి. కాడలు ఎండిపోకుండా లేతగా ఉండాలి. సొరకాయ పైన ఉండే చిన్న హెయిర్ లాంటి నూగు కూడా లేతదనానికి సూచిక. ముదిరిన సొరకాయలు రుచిగా ఉండవు..
కీరదోస: కీరదోసను నొక్కినప్పుడు గట్టిగా ఉంటే అది మంచిది. చిన్న సైజులో ఉన్న వాటిని ఎంచుకుంటే గింజలు తక్కువగా ఉంటాయి.
బీట్రూట్, ముల్లంగి: బీట్రూట్ – ముల్లంగిని నొక్కినప్పుడు మెత్తగా ఉండకుండా గట్టిగా ఉండాలి. ముల్లంగికి కాన్స్టిపేషన్ సమస్యలు, బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచిది. దీని పైన ఉన్న ఆకులు ఆకుపచ్చగా ఉంటే తాజాదనానికి సంకేతం.
వంకాయలు: వంకాయలు కొనేటప్పుడు పురుగులు తినకుండా, రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. చిన్న సైజు వంకాయలు, తొడిమ బాగా ఆకుపచ్చగా ఉండి, పైన నూగు ఉన్నవి లేతవి, ఫ్రెష్‌గా ఉంటాయి. ముదురు రంగులో ఉన్న వంకాయలు సాధారణంగా తాజావిగా పరిగణిస్తారు.
క్యారెట్లు: క్యారెట్లు నేరుగా, దృఢంగా, మచ్చలు లేకుండా ఉండాలి. వంకరగా ఉన్నవి, పైన స్కిన్ పాడైనవి తీసుకోకూడదు.
బెండకాయలు: లేత బెండకాయలను ఎంచుకోవడానికి, వాటి చివరి భాగాన్ని (కాడని) నొక్కితే వెంటనే విరిగిపోవాలి. ఇది లేతదనానికి స్పష్టమైన సంకేతం.
బంగాళాదుంపలు: గీతలు, మచ్చలు ఉన్న బంగాళాదుంపలు తీసుకోకూడదు. చిన్న కణుపులు వస్తున్నవి కూడా నివారించాలి, ఎందుకంటే అవి త్వరగా మొలకెత్తి పాడైపోతాయి. దృఢంగా ఉన్న బంగాళాదుంపలను ఎంచుకోవాలి.
బీన్స్, చిక్కుడుకాయలు: ఇవి రెండు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉంటే తాజావి. ఇలాంటివి కొంటే ఇంట్లో రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి. పాడైనవి కొంటే అసలు నిల్వ ఉండవు.
నిమ్మకాయలు: ఆకుపచ్చ రంగులో ఉన్నవాటి కంటే, పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు, మచ్చలు లేకుండా ఉన్నవి మంచివి.
టమాటాలు: టమాటాలు మరీ పండినవి కాకుండా, మరీ పచ్చివి కాకుండా మధ్యస్థంగా ఉన్నవి కొంటే 4-5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాడ దగ్గర పసుపు రంగులో ఉండి, మిగతా భాగం ఎరుపు రంగులో ఉన్నవి నిల్వ చేసుకోవడానికి బాగుంటాయి.
దొండకాయలు: దొండకాయలను నొక్కినప్పుడు మెత్తగా ఉంటే అవి త్వరగా పండిపోతాయి.. కాబట్టి తీసుకోకూడదు. గట్టిగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నవి ఎంచుకోవాలి.
ఆకుకూరలు: ఆకుకూరలు ఎల్లప్పుడూ తాజాగా, ఆకుపచ్చగా ఉండాలి. పసుపు రంగు ఆకులు ఉన్నవాటిని తీసుకోకూడదు.
అరటికాయలు: లేతవి కాకుండా, కొంచెం ముదిరిన, పెద్ద సైజు అరటికాయలను కూర కోసం ఎంచుకుంటే రుచిగా ఉంటుంది.
అల్లం: అల్లం పుచ్చులు, రంధ్రాలు లేకుండా పొడిగా, గట్టిగా ఉండాలి. తడిగా, నీరుగా, పారదర్శకంగా కనిపించే అల్లం తీసుకోకూడదు, అది రుచి, వాసన బాగోదు. విరిచి చూస్తే లోపల పొడిగా ఉండాలి.
కాకరకాయలు: ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న కాకరకాయలను ఎంచుకోవాలి. తెలుపు రంగులో ఉన్నవాటిని నివారించాలి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా, మీరు మార్కెట్‌లో తాజా, నాణ్యమైన కూరగాయలను ఎంచుకోవచ్చు. ఇది మీ వంట రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అయితే.. కూరగాయలు కొనేటప్పుడు ఎక్కువ మొత్తంలో కొనకుండా.. తక్కువగా కొనుగోలు చేయడం ద్వారా.. వృధాను అలాగే డబ్బును ఆదా చేసుకోవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..