
అరటిపండ్లను ఇష్టపడని వారుండరు. కానీ, అవి త్వరగా మగ్గి నల్లగా మారడం ఒక పెద్ద సమస్య. అయితే, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా, రుచిగా ఉంటాయి. ఈ పద్ధతులకు ప్రత్యేకంగా ఖర్చు అవసరం లేదు.
అరటిపండ్లు ఎథిలీన్ అనే ఒక సహజ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ పండ్లు మగ్గడానికి సహాయపడుతుంది. పండు మగ్గే కొద్దీ, ఎథిలీన్ ఎక్కువ విడుదల అవుతుంది. దీనివల్ల పండు త్వరగా మెత్తగా మారుతుంది.
అరటిపండ్లను సరిగ్గా నిల్వ చేయడం వాటి జీవితకాలాన్ని పెంచుతుంది.
చల్లని, పొడి ప్రదేశం: అరటిపండ్లను ఎండ తగలని చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి. కిటికీ పక్కన పెట్టకుండా, గాలి తగిలే కౌంటర్‌పై లేదా ప్యాంట్రీలో ఉంచడం మంచిది. పూర్తిగా పండిన అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. బయటి పొట్టు నల్లగా మారినా లోపలి గుజ్జు తాజాగా ఉంటుంది.
వేరే పండ్ల నుంచి దూరంగా: అరటిపండ్లను యాపిల్స్, టమోటాలు, అవకాడోలు, పీచెస్ వంటి పండ్ల నుంచి దూరంగా ఉంచడం ముఖ్యం. ఎందుకంటే ఆ పండ్లు కూడా ఎథిలీన్ హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయి.
తొడిమలను వేరు చేయడం: అరటిపండు తొడిమల నుంచి ఎక్కువ ఎథిలీన్ వాయువు విడుదలవుతుంది. అందుకే తొడిమలను ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్‌తో గట్టిగా చుట్టడం ద్వారా ఆ వాయువు ఇతర అరటిపండ్లకు చేరకుండా ఆపవచ్చు.
అరటిపండ్లను కౌంటర్‌పై ఉంచడం వల్ల బరువు వాటిపై పడి నల్లగా మచ్చలు పడతాయి. అందుకే వాటిని వేలాడదీయడం మంచిది. ఇలా చేస్తే వాటిపై ఒత్తిడి తగ్గుతుంది, గాలి వాటి చుట్టూ బాగా తిరుగుతుంది. ఈ చిట్కాలతో ఆహార వ్యర్థాలు కూడా తగ్గుతాయి.