తులసి మొక్క హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనది. దీనిని దేవతల ఆరాధనలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆరోగ్య పరంగా కూడా తులసికి గొప్ప ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధగుణాలు ఉన్న మహామూలికగా గుర్తించారు.
ఎక్కువ మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ప్రేమతో పెంచుతారు. అయితే కాలానుగుణ మార్పుల వల్ల ఇది ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి, చలికాలంలో తులసి మొక్క కాస్త బలహీనంగా మారుతుంది. అయితే దీన్ని సరైన విధంగా చూసుకుంటే ఇంట్లో శుభఫలితాలు రావచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
తులసి మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు దాని స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తగిన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా ఉంచితే కుటుంబ సభ్యుల జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని అంటారు.
తులసి మొక్కను ఇంటి ముందువైపున, మద్యంలో లేదా ఉత్తర, ఈశాన్య దిశలో ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎవరికైనా బాల్కనీలో లేదా కిటికీ దగ్గర పెంచాలని అనుకుంటే పై పేర్కొన్న దిశల్లో ఉంచడం మంచిది.
దక్షిణ దిశను యమధర్ముని దిశగా భావిస్తారు. ఈ దిశలో తులసి మొక్కను ఉంచితే ఇంట్లో అసౌభాగ్యం చేకూరుతుందని నమ్మకం. అదేవిధంగా దీని వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని కూడా చెబుతారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశముందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.