AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ హైహీల్స్ అందంగానే ఉంటాయ్.. కానీ, ఈ ఆరోగ్య సమస్యలు తెస్తాయ్

హైహీల్స్‌ చెప్పులు మహిళల అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచినా.. వాటిని ఎక్కువసేపు ధరించడం వల్ల పాదాలు, మడమలు, వెన్నెముకపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అధిక హీల్స్‌ కారణంగా పాదాల నొప్పులు, కండరాల బలహీనత, నడుం–వెన్నెముక నొప్పులు, నడకలో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

అమ్మాయిలూ హైహీల్స్ అందంగానే ఉంటాయ్.. కానీ, ఈ ఆరోగ్య సమస్యలు తెస్తాయ్
High Heels Health Risks
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2026 | 6:06 PM

Share

చాలా మంది అమ్మాయిలు హై హీల్స్ చెప్పులు ధరించేందుకు ఇష్టపడతారు.. ముఖ్యంగా హైహీల్స్ చెప్పులు ఆధునిక మహిళలకు అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. అయితే, వీటిని దీర్ఘకాలం ధరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం నిలబడినప్పుడు శరీర భారాన్ని పాదాలు మోస్తాయి. హైహీల్స్ ధరించినప్పుడు ఈ భారం మడమలపై కేంద్రీకృతమై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది.

ఉదాహరణకు, ఒక అంగుళం ఎత్తు హీల్ వల్ల మడమలపై భారం 22 శాతం పెరుగుతుంది. రెండు అంగుళాల హీల్ అయితే ఇది 57 శాతానికి చేరుకుంటుంది. ఇలా అధిక భారం పడటం వల్ల పాదాల కండరాలు బలహీనపడతాయి. ఇది సాధారణ చెప్పులు వేసుకొని నడవడానికి కూడా కష్టంగా మారుతుంది.

హైహీల్స్‌ను నాలుగు గంటలకు మించి ధరించకపోవడం మంచిది. అనివార్యమైన పరిస్థితుల్లో ఎక్కువ సమయం ధరించాల్సి వస్తే, ఇంటికి వెళ్ళగానే ఐస్‌తో కాపడం పెట్టుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

హైహీల్స్ శరీరం బరువును అటూ ఇటూ మారుస్తాయి.. దీనివల్ల శరీర సమన్వయం దెబ్బతిని వెన్నెముకపై అదనపు భారం పడుతుంది. ఇది నడుం, వెన్నె నొప్పులకు ప్రధాన కారణమవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి, ఒకటి నుండి ఒకటిన్నర అంగుళాల పొడవు ఉన్న హీల్స్ ఉన్న చెప్పులను ఎంచుకోవడం ఉత్తమం.

ముఖ్యంగా అధిక ఎత్తు ఉన్న హీల్స్‌ను కొనుగోలు చేసే ముందు వాటి సౌకర్యాన్ని ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. నడక, యోగ, ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా హైహీల్స్ వల్ల కలిగే వెన్నె నొప్పులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు..

ఆరోగ్యకరమైన పాదాలు, వెన్నెముక కోసం హైహీల్స్ వాడకాన్ని తగ్గించడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. ఇంకా.. హైహీల్స్ వల్ల నొప్పులతో బాధపడుతుంటే.. ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us