Height Growth: పిల్లలు హైట్ పెరగట్లేదా.. ఈ టిప్స్ పాటిస్తే రెట్టింపు వేగంతో పొడుగవుతారు..

కొందరు తల్లిదండ్రులకు పిల్లల బరువు, ఎత్తు పెద్ద సమస్యగా మారుతుంటాయి. బరువులో కాస్త హెచ్చుతగ్గులుంటే వాటిని ఏదోరకంగా సరిచేసుకోవచ్చు. కానీ, పిల్లలు పెరగాల్సిన వయసులో ఎత్తు పెరగకపోతే తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా దీనిని సరిచేయలేం. అది పెద్దయ్యాక కూడా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పిల్లలు సరైన వయసులో సరైన హైట్ ఎదిగేందుకు మీరేం చేయాలో తెలుసుకోండి..

Height Growth: పిల్లలు హైట్ పెరగట్లేదా.. ఈ టిప్స్ పాటిస్తే రెట్టింపు వేగంతో పొడుగవుతారు..
Short Height Kids

Updated on: Feb 26, 2025 | 2:51 PM

తమ పిల్లలు ఎత్తు పెరగకపోతే అది తమ జీన్స్ కారణంగా అని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇది అన్ని సార్లు నిజం కాదు. పిల్లలకు సరైన వ్యాయామం, పోషకాహారం అందితే మగపిల్లలైతే తండ్రికన్నా, ఆడపిల్లలైతే తల్లి కన్నా ఎత్తు పెరిగే అవకాశాలు చాలానే ఉంటాయి. మీ పిల్లలకు ఏం తినిపిస్తున్నారు. వారు రోజంతా ఎలాంటి ఆటలు ఆడుతున్నారు. లేదా తరగతి గదికే పరిమితమవుతున్నారా అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. పిల్లలు సరైన ఎత్తు లేకపోవడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. తరగతిలో వీరి వయసున్న వారితో పోల్చుకుని వారు ఆత్మనూన్యతకు గురవుతుంటారు. పెద్దయ్యాక కూడా నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండలేరు. వీటికన్నా కూడా చిన్న వయసులోనే వారి ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే మీ పిల్లల హైట్ ను లైట్ తీసుకోకుండా ఇప్పుడే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టండి.

స్ట్రెచింగ్స్ తో మొదలుపెట్టండి..

పిల్లలు ఎత్తు పెరగాలంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు ఎంతగానో పనిచేస్తాయి. పూర్వం పెద్దవాళ్లు కూడా నిటారుగా నిల్చుని కాలి బొటని వేలిని వంగి అందుకునే టెక్నిక్స్ నేర్పేవారు. కొందరు ఇంట్లోని ధూలానికి వేళ్లాడేవారు. నిజానికి ఇవన్నీ ఎంతో గొప్పగా పనిచేస్తాయి. పిల్లలు ఎత్తు పెరగడంలో ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలు కచ్చితంగా చేయించండి. ఇవి వారి శరీరాన్ని కుంచించుకుపోకుండా సాగేలా చేస్తాయి.

ఆసనాలు బెస్ట్..

మీ పిల్లలకు వీకెండ్ లో చిన్న చిన్న యోగాసనాలు నేర్పండి వాటిని రోజూ ట్రై చేసేలా ప్రోత్సహించండి. సూర్య నమస్కారాలు, పాద పశ్చిమోత్తాసనం, చ్రకాసనం వంటివి పిల్లల కండరాలపై ఒత్తిడి పెంచి వేగంగా ఎత్తుపెరిగేలా చేస్తాయి. ఇందుకు సంబంధించిన ఆసనాలు వీడయోల రూపంలోనూ లభిస్తాయి. కాబట్టి ఎవ్వరైనా ట్రై చేయవచ్చు.

ఈత నేర్పండి..

పిల్లలు ఎంత వయసొచ్చినా ఎత్తు పెరగలేకపోతుంటే వారికి చిన్న ప్రయత్నంగా ఈత నేర్పండి. కండరాలను బలంగా చేసి స్ట్రెచ్ చేయగలిగే శక్తి ఈతకు ఉంది. ఇదొక్కటి చేయగలిగినా వారు కచ్చితంగా ఎత్తు పెరుగుతారు. ఈత అనేది వారికి ఆకలిని పెంచి మంచి బరువు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ ఉపయోగపడుతుంది. ఇంకా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

నిద్ర పదిలం..

పిల్లలో ఎదుగుదలకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్ రాత్రి వేళల్లోనే విడుదలవుతుంది. పిల్లలు సమయానికి నిద్రపోకుండా టీవీ, ఫోన్ల వంటివి వాడుతూ ఉంటే ఇది పనిచేయదు. అందుకే వారు వేళకు తిని వేళకు పడుకునేలా పేరెంట్స్ చూసుకోవాలి.

ఏం తింటే మంచిది..

ఎత్తు సరైన విధంగా ఉండాలంటే పిల్లలకు మంచి పోషకాహారం అవసరం ఎంతో ఉంది. అందుకే వారికి విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినిపించండి. చేపలు, గుడ్లు, పుట్టగొడుగుల్లో విటమిన్ డి అధికంగా లభిస్తుంది. వీటితో పాటు తాజా ఆకుకూరలు, పండ్లను అందివ్వాలి.