పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అనేక రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ప్రతీ పండులోనూ ప్రత్యేక పోషక అంశాలు ఉంటాయి. పండ్లు తినడం వల్ల మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది. ప్రతీరోజూ ఉదయం అల్పాహారంలో పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పండ్లు తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలామంది పండ్లను వివిధ పదార్ధాలతో, పంచదార మొదలగు వాటిని కలుపుకుని తింటుంటారు. అయితే ఇలా తినడం వల్ల మీ జీర్ణశక్తి క్షీణించే అవకాశం ఉంటుంది. వివిధ పదార్ధాలతో కలిపి పండ్లను తినడం ద్వారా మీకు పోషకాలు పూర్తిగా లభించవు. కాబట్టి పండ్లను ఎప్పుడూ ఇతర పదార్ధాలతో కలిపి తినకూడదు.
శాస్త్రీయంగా పండ్లు తినడానికి నిర్దేశిత సమయం అంటూ ఏమిలేదు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, అల్పాహారం తర్వాత లేదా స్నాక్స్ సమయంలో లేదా వ్యాయామం చేసిన తర్వాత సాయంత్రం వేళ పండ్లు తినాలని చెబుతారు. ఈ సమయాల్లో తినడం వల్ల పోషకాలు పుష్కలంగా అందుతాయని అంటున్నారు. పండ్లను ఎల్లప్పుడూ బాగా నమిలి తినడం ద్వారా జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది.
పండ్లను కోసి ముక్కలుగా తినే బదులు.. మొత్తంగా తినాలి. అలా తినడం వల్ల ఫైబర్స్‌ను కూడా తింటారు. అది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, కడుపు సమస్యలు, మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.