AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..

నిమ్మకాయ మొక్కలు నిరంతరం గుత్తులుగా కాయాలంటే, గ్రాఫ్టెడ్ మొక్కలను ఎంచుకోవడం, పెద్ద కంటైనర్లలో పెంచడం ముఖ్యం. సరైన నీరు, పూర్తి సూర్యరశ్మి, నైట్రోజన్-పొటాషియం సమృద్ధిగా ఉండే ఎరువులు, క్రమంగా ప్రూనింగ్, పరాగసంపద, తెగుళ్ళ నివారణ వంటి సంరక్షణ పద్ధతులు పాటించాలి.. అయితే.. కొన్ని చర్యలతో నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయని పేర్కొంటున్నారు నిపుణులు..

నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
Lemon Tree
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2026 | 4:01 PM

Share

నిమ్మ చెట్టు దాదాపు చాలా మంది ఇళ్లలో ఉంటుంది. ఏడాది పొడవున నిమ్మకాయలు కాస్తూనే ఉంటాయి.. అయితే.. నిమ్మచెట్లకు నిరంతరం గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు కాయడానికి సమగ్ర సంరక్షణ పద్ధతులు పాటించడం మంచిది.. మంచి దిగుబడి కోసం ముందుగా నర్సరీ నుండి గ్రాఫ్టెడ్ నిమ్మ మొక్కలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.. గ్రాఫ్టెడ్ మొక్కలు త్వరగా పూత, కాతను అందిస్తాయి. నిమ్మ మొక్కలు పెద్దవిగా పెరిగే పర్మనెంట్ జాతులు కాబట్టి, వాటిని పెద్ద సైజు కంటైనర్లు, డ్రమ్ములు లేదా బకెట్లలో నాటాలి. ఇది మొక్కల ఎదుగుదలకు, వేర్లు విస్తరించడానికి తోడ్పడుతుంది.. సాధారణంగా పెరట్లో నమ్మకాయ చెట్లను పెంచుకోవడం ద్వారా ఎక్కువ కాపు వస్తుంది.. అలాగే చెట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.

నీటిపారుదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిమ్మ మొక్కలకు తక్కువ నీరు అవసరం. నేల ఉపరితలం 2 నుండి 3 అంగుళాలు ఆరిపోయిన తర్వాత మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పూత రాలిపోవడానికి కారణమవుతుంది. అలాగే, నిమ్మ మొక్కలకు పూర్తి రోజు సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మి తక్కువైతే మొక్క సరిగ్గా ఎదగదు, పూత, కాత కూడా తక్కువగా ఉంటాయి.

నిమ్మ మొక్కలకు నైట్రోజన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా కావాలి. నైట్రోజన్ కోసం, నిమ్మ మొక్క పక్కన చిక్కుడు మొక్కలను పెంచడం వల్ల వాటి వేరు వ్యవస్థ నుండి సహజంగా నైట్రోజన్ లభిస్తుంది. పొటాషియం కోసం, చోహాన్ క్యూ పద్ధతిలో తయారైన ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఎరువుగా ఇవ్వవచ్చు.

ఫర్టిలైజర్స్ను క్రమ పద్ధతిలో అందించాలి. ప్రతీ 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలి. అదే విధంగా, ప్రతీ 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల తెగుళ్ళను నివారించవచ్చు. ప్రతి వారం లిక్విడ్ ఫర్టిలైజర్స్ను మార్చి మార్చి ఇవ్వాలి. ఉదాహరణకు, ఒక వారం గుడ్డు ఎమల్షన్, మరొక వారం చోహాన్ క్యూ లిక్విడ్ ఫర్టిలైజర్, ఆపై బనానా పీల్ ఫర్టిలైజర్ వంటివి ఇవ్వడం ద్వారా మొక్కకు అన్ని అవసరమైన పోషకాలు అందుతాయి.

మంచి పరాగసంపద (pollination) కోసం నిమ్మ మొక్కల కుండీల పక్కన ఆవాలు, బంతి, కాస్మోస్ వంటి పూల మొక్కలను పెంచాలి. ఇవి తేనెటీగలు, ఇతర పరాగసంపద కీటకాలను ఆకర్షిస్తాయి, తద్వారా పిందెలు కాయలుగా మారే అవకాశాలు పెరుగుతాయి. నిమ్మ మొక్కలకు ఎక్కువగా తెగుళ్లు ఆశించవు. చిన్న నల్ల పురుగులు కనిపిస్తే, వాటిని చేతితో తీసి నలిపేయవచ్చు. ఒకవేళ తెగుళ్లు ఎక్కువగా ఉంటే, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు.

కాత పూర్తయిన తర్వాత ప్రూనింగ్ (కొమ్మల కత్తిరింపు) చేయడం చాలా ముఖ్యం. ఇది మొక్కకు కొత్త కొమ్మలు రావడానికి సహాయపడుతుంది. కొత్త కొమ్మలు వస్తే పూత, కాత కూడా పెరుగుతుంది, ఫలితంగా అధిక దిగుబడి పొందవచ్చు. ప్రూనింగ్ ద్వారా మొక్కను బుషీగా ఉంచి, ఎత్తు పెరగకుండా నియంత్రించవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ గార్డెన్‌లో నిమ్మకాయ మొక్కల నుండి గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలను పొందవచ్చు.

అలాగే.. నిమ్మకాయ చెట్టు ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా ఫలసాయం తగ్గడం వంటి సమస్యలకు ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం నీటిలో సాల్ట్ కలిపి.. వేర్ల దగ్గర పోయడం ద్వారా ఎక్కువ కాయలు కాసేలా చేయవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us