పచ్చని మొక్కల నడుమ ప్రాణాలు తీసే పాములు.. మీ ఇంట్లో ఉన్నాయో లేదో ఎలా గుర్తించాలంటే?

మీకు గార్డెన్ అన్నా, లేదా ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అన్నా.. బాగా ఇష్టమా? అయితే మీరు ప్రమాదాల్లో పడినట్టే. ఎందుకంటే ఆ అందమైన మొక్కల వెనుక ప్రాణాలు తీసే ప్రమాదకర జీవులు కూడా దాక్కుంటున్నాయి. అవును కొన్ని పచ్చటి పాములు మొక్కలకు ఉన్న ఆకుల రంగులో కలిసిపోయి మీ ఇంట్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న మొక్కలపై పాములు ఉన్నాయో లేదో గుర్తించడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

పచ్చని మొక్కల నడుమ ప్రాణాలు తీసే పాములు.. మీ ఇంట్లో ఉన్నాయో లేదో ఎలా గుర్తించాలంటే?
How To Know If There Is A Snake In Your Garden

Updated on: May 16, 2026 | 6:07 AM

సాధారణంగా పాములు అనగానే మనకు అడవులు, పొదలు లేదా తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలే గుర్తొస్తాయి. కానీ వేసవి కాలంలో పాములు తరచూ జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. అయితే, కొన్ని రకాల పాములు కేవలం చెట్లు, మొక్కలపైనే నివసిస్తాయని మీకు తెలుసా? వీటిని ఆర్బోరియల్ స్నేక్స్ అంటారు. ఈ పాములు ఎంత తెలివైనవంటే, వీటి పచ్చని రంగు కారణంగా మనకు తెలియకుండానే మన ఇళ్లలో ఉండే ఆకు పచ్చ మొక్కల్లోకి దూరి కలిసిపోతాయి. అందుకే ఇవి మీ ఇంటి కుండీలలో లేదా తోటలోని చెట్లపై గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చున్నా కూడా ఎవరూ వాటిని గమనించలేరు. ఇవి చెట్లపైనే నిద్రించడమే కాకుండా, అక్కడే తమ ఆహారాన్ని కూడా వేటాడుకుంటాయి. ఈ పాములు తమ జీవితకాలం మొత్తాన్ని చెట్లపైనే గడుపుతాయి.

మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమైతే, మీ ఇంటి తోటలో లేదా కుండీలలో కూడా ఇలాంటి పాములు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే, వీటిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీ ఇంట్లో ఉండే మొక్కల మధ్య కనిపించకుండా దాగి ఉండే ఈ పాములను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

చెట్లు లేదా కుండీలలో పాము ఉందని ఎలా గుర్తించాలి?

కొమ్మల కదలికలను గమనించండి: ఆకుల మధ్య ఈ పాములను కనిపెట్టడం నిజంగా ఒక సవాలే. అయితే వీటిని గుర్తించడానికి కొన్ని ఖచ్చితమైన మార్గాలు ఉన్నాయి. చెట్టు కొమ్మల ఆకారాన్ని, వాటి లావును నిశితంగా గమనించాలి. ఏదైనా కొమ్మ అకస్మాత్తుగా కదిలినట్లు అనిపించినా, లేదా దాని రూపం మామూలు కర్రలా కాకుండా కాస్త నునుపుగా, మెరుస్తూ ఉన్నట్లు అనిపిస్తే అక్కడ పాము ఉండే అవకాశం ఉంది.

కళ్లు, అకస్మాత్తు కదలికలు: ఇవి గంటల తరబడి కదలకుండా ఉన్నప్పటికీ, వీటి మెరిసే కళ్లు లేదా అకస్మాత్తుగా చేసే వేగవంతమైన కదలికల వల్ల దొరికిపోతాయి. కాబట్టి మీ కుండీల్లో లేదా గార్డెన్‌లో ఇలాంటి ఏవైనా మెరుపులు కనిపించినప్పుడూ కాస్త జాగ్రత్తగా పరిశీలించండి

పక్షులు, ఉడుతల అరుపులు: మీ తోటలో లేదా కుండీల చుట్టుపక్కల పక్షులు అకస్మాత్తుగా అరుస్తూ అల్లరి చేసినా, లేదా ఉడుతలు కంగారు పడుతున్నా.. అక్కడ ఏదో ఒక పాము దాగి ఉందని అర్థం. కొన్ని సార్లు ఈ పాములు చెట్టు కొమ్మలను తమ తోకతో చాలా గట్టిగా చుట్టుకుని పట్టుకుంటాయి. కాబట్టి సన్నని కొమ్మలకు ఏదైనా తాడులాంటిది చుట్టుకుని ఉన్నట్లు కనిపిస్తే, అది పాము కావచ్చు.కాబట్టి మీ తోటలో ఇలాంటి మార్పులు కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి. ఒక వేళ పాములు ఉంటే వెంటనే వాటిని తరిమికొట్టే చర్యలు చేపట్టండి.

జాగ్రత్త: ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ దట్టమైన మొక్కల్లో లేదా కుండీలలో నేరుగా చేతులు పెట్టకండి. ఎల్లప్పుడూ ఒక కర్రను ఉపయోగించండి. ఈ పాములు తమకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భావిస్తే, ఆత్మరక్షణ కోసం చాలా వేగంగా దాడి చేస్తాయని గుర్తుంచుకోండి. ఒక వేళ మీరు ఏవైనా పాములను గుర్తిస్తే వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చి వాటిని పట్టించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us