Corona Virus: కరోనా వైరస్ వెలుగుకి వచ్చిన అనంతరం మానవ జీవితాన్ని కోవిడ్(Covid 19) కు ముందు తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. ఆర్దికంగానే కాదు.. మానవసంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. అనేక మంది మానవత్వంతో సాటివారికి సాయం చేశారు.. కరోనా తో తమ ఫ్యామిలీ సభ్యులను, చుట్టాలను, స్నేహితులను పోగొట్టుకున్న వారు ఎందరో.. అయితే కొందరు ఈ బాధను పోగొట్టుకునేందుకు విభిన్న మార్గాన్ని అనుసరించారు. ఆలాంటి వారిలో 88 ఏళ్ల బామ్మ ఒకరు. కరోనా తో భర్తను పోగొట్టుకున్న ఈ బామ్మా.. తన జీవితంలో బాధను పోగొట్టుకునేందుకు సరికొత్త పంథాను అనుసరించింది. తనకు వచ్చిన పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టి.. అందులో వచ్చిన లాభాలను కష్టాల్లో ఉన్నవారికి అందిస్తోంది. ఇంత పెద్ద వయసులో తోటివారికి సేవ చేస్తున్న బామ్మా స్పూర్తి కథనం మీ కోసం..
ఉషాగుప్తా వయసు 88. గతేడాది కోవిడ్ 19 సెకండ్ వేవ్ లో ఉషాగుప్తా, రాజ్ కుమార్ దంపతులు డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. దీంతో ఈ దంపతులు ఉషాగుప్తా, ఆమె భర్త రాజ్ కుమార్ ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో చేరారు. 27 రోజుల పాటు కోవిడ్-19తో పోరాడిన తర్వాత, ఆమె భర్త రాజ్ కుమార్ కన్నుమూశారు. కొవిడ్‌ను గెలిచి ఉష ఇంటికి చేరుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ఆమె వైవాహిక జీవితం ఒక సెకనులో ముగిసింది. భర్తను పోగొట్టుకున్న ఉషాగుప్తా మానసికంగా కుంగిపోయారు. అయితే ఉష ఆసుపత్రిలో ఉండగానే తన చుట్టూ ఉన్న రోగులు, కుటుంబాలు పడుతున్న నిస్సహాయతను చూసింది. ఆర్ధిక కష్టాలు, వైద్యం, ఆరోగ్యపరంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆమెను ఎంతగానో కలిచివేశాయి. ఆ విపత్కర సమయంలో అందరూ తమకు చేతనైన సాయం చేయడాన్ని గమనించారు. తనూ ఏదైనా చేయలనుకున్నారు ఉషాగుప్తా. దీంతో అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేసే ప్రయత్నంలో, ఉష తనకు చేతనైనది చేశారు. రుచికరమైన భోజనం వండిపెట్టారు.
ఉషాగుప్తా మనవరాలు.. ఢిల్లీకి చెందిన శిశువైద్యుడు డాక్టర్ రాధిక బాత్రా, కోవిడ్-19 సహాయ కార్యక్రమాల కోసం ఏదైనా చేయామని బామ్మగారిని ప్రోత్సహించారు. దీంతో తనకు మంచి పేరున్న పచ్చళ్ళు తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నారు. దీంతో మనవరాలు డాక్టర్ రాధికతో చర్చించారు. ఉషాగుప్తా ఆలోచన ఇంట్లో అందరికీ నచ్చింది. ‘పికిల్డ్ విత్ లవ్’ పేరు తో పచ్చళ్లు, చట్నీల వ్యాపారం జూలై 2021లో ప్రారంభమైంది. అలా రకరకాల నిల్వ పచ్చళ్ళు, రోటి పచ్చళ్లు తయారు చేయడం మనవరాలు రాధిక సాయంతో ఉషాగుప్తా మొదలు పెట్టారు. అలా తయారు చేసిన పచ్చళ్లను ముందుగా తెలిసిన వారిని అందజేశారు.
ఇలా అమ్మగా వచ్చిన డబ్బులను పేదల సంక్షేమానికి వినియోగించనున్నామని తెలిసిన వారికీ, సన్నిహితులకు చెప్పారు. రుచికరమైన పచ్చళ్లు మంచి పని కావడంతో తెలిసినవారు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు కొనడం ప్రారంభించారు. సోషల్‌మీడియా ద్వారా ఉష పచ్చళ్ల గురించి.. టెస్టు గురించి మరింత పాపులర్ అయ్యారు. అమ్మకాలు పెరిగాయి. ఆదాయం కూడా పెరిగింది. దీంతో బామ్మగారు తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కొవిడ్ బాధిత పేద కుటుంబాలకు విరాళంగా ఇచ్చేవారు
అలా ప్రారంభించిన ఈ చిరు వ్యాపారం అతి తక్కువ రోజుల్లోనే విజయవంతమైంది. ప్రారంభించిన నెలలోపే 200 ఆర్డర్లు వచ్చాయి. పచ్చళ్ల తయారీతోపాటు పలురకాల మసాలాలను కూడా చేయడం మొదలుపెట్టారు. తనకు శక్తిలేదని.. అయినా ఏదోకటి చేయాలనే తపన ముందు తన వయసు, శక్తి వంటివేమీ గుర్తు రాలేదని చెబుతున్నారు బామ్మ. పచ్చళ్లను నింపే సీసాలు, లేబుల్స్ అన్నీ మా మనవరాలు చూసుకుంటుంది అంటున్నారు ఉషా. తాజా కూర గాయలు, పచ్చళ్ల దినుసుల ఎంపికలో నాణ్యత, ఎక్కువ కాలం నిల్వ ఉండడం.. పచ్చళ్ల రుచి చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ కొంటున్నారు. 200 గ్రాముల ఒక్కో బాటిల్ ధర రూ.150.
తనతో ఇప్పుడు భర్త లేకపోయినా.. ఇలా పదిమందికి సాయం చేస్తుంటే తనతోనే తన భర్త ఉన్నదనే సంతోషం ఉందని చెబుతున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు పచ్చళ్ల ఆర్డర్ల మరింత రెట్టింపు అయ్యాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా వచ్చిన లాభాలను పేదల కోసం పనిచేసే ఎన్జీవోలకు విరాళంగా అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ రూ.2 లక్షలకు పైగా నగదును విరాళంగా అందించమని తెలిపారు. అంతేకాదు రోడ్ల మీద ఉండేవారికి కూడా తినడానికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా గత ఏడాదిన్నరలో దాదాపు 65 వేలమంది ఆకలి తీర్చామని ఉషాగుప్త తెలిపారు. ఎవరికైనా ఉషాగుప్తా పచ్చళ్ల కోసం, లేదా ఆమె వంటల పుస్తకం కోసం ఆర్డర్ చేయాలనుకుంటే..91 98736 43639కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు.