చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలను సాధారణంగా తీసుకోవడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే అవి ఐబీఎస్, అల్సర్లు లేదా ఇతర జీర్ణాశయ వ్యాధులకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా కారణం లేకుండా బరువు తగ్గడం, మలంలో రక్తం కనిపించడం, నిరంతర కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు, క్రమబద్ధమైన జీవనశైలి ద్వారా కడుపు సమస్యలను చాలా వరకు నివారించవచ్చని చెబుతున్నారు..

ఇటీవలి కాలంలో చాలా మంది కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది వీటిని సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల హెచ్చరిక ప్రకారం, ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ మరియు అనుబంధ ఆసుపత్రిలోని వైద్య నిపుణుడు డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ ప్రకారం, ప్రస్తుతం పెరుగుతున్న కడుపు సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లేనని చెబుతున్నారు.
కడుపు సమస్యలకు ప్రధాన కారణాలివే
ప్రస్తుతం చాలా మంది పిండి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకుంటున్నారు. ఈ ఆహారాలు సులభంగా జీర్ణం కాకపోవడంతో గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొంతమందికి పాలు, గ్లూటెన్ లేదా కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కావు. దీనివల్ల కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, స్వల్ప నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్, మలబద్ధకం లేదా అజీర్ణ సమస్యలు ఉంటే అవి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా పేగుల వాపు వంటి వ్యాధులకు సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కడుపు సమస్యలు అల్సర్లు లేదా జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
కడుపు సమస్యలతో పాటు కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
- కారణం లేకుండా బరువు తగ్గిపోవడం
- తరచూ వాంతులు కావడం
- మలంలో రక్తం కనిపించడం
- తీవ్రమైన బలహీనత, అలసట
- నిరంతర కడుపు నొప్పి
ఈ లక్షణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..
వైద్యుల సూచనల ప్రకారం ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నొప్పి లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, అవి తరచూ వస్తే వైద్యులను సంప్రదించడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




