కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను మన వంటగదిలో ఉండే మసాలా దినుసులను ఉపయోగించే ఇట్టే నయం చేయవచ్చు. మన పూర్వీకులు ఎంతో ముందుచూపుతోనే ఆయుర్వేదంలోనూ, ఆహారంలోనూ ఉపయోగపడే మసాలా దినుసులను మన వంటింటిలోకి చేర్చిపెట్టారు. వంట గదిలో ఉండే ఒక్కో మసాల దినుసులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కల్పించడంలో సమర్థవంతంగా పనిచస్తాయి. మరి అలాంటి వాటిలో మెంతులు కూడా ఒకటి. సాధారణంగా మెంతి ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు. అలాగే ఇతరత్రా వంటలలోనూ మెంతులను ఉపయోగిస్తుంటారు మన భారతీయ స్త్రీలు. ఇక మెంతి పొడిని అయితే ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతారు. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో అనేక రకాల ఔషధగుణాలనున్నాయి.
అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. మరి ఈ క్రమంలో మెంతుల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..