AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Biryani Day 2026: రుచిలో దీన్ని కొట్టేదే లేదు.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ స్పెషాలిటీ ఇదే

ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ మరోసారి చర్చనీయాంశమైంది. పర్షియా నుంచి భారత్‌కు చేరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బిర్యానీకి హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. దమ్ బిర్యానీ చరిత్ర, ప్రత్యేకత, విభిన్న రకాల బిర్యానీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

World Biryani Day 2026: రుచిలో దీన్ని కొట్టేదే లేదు.. వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీ స్పెషాలిటీ ఇదే
World Biryani Day
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2026 | 1:53 PM

Share

హైదరాబాద్ పేరు వినగానే మనకు వెంటనే బిర్యానీ, ఇరానీ చాయ్ గుర్తుకొస్తాయి. తింటే హైదరాబాదీ బిర్యానీనే తినాలి, తాగితే ఇరానీ చాయ్ నే తాగాలి అన్నట్లుగా ఒక ముద్ర పడిపోయింది. ఈ రోజు వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ దమ్ బిర్యానీ చరిత్ర, ప్రాముఖ్యత, విభిన్న రుచుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. వాస్తవానికి, ప్రతి సంవత్సరం జూలై మొదటి ఆదివారం నాడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం (World Biryani Day 2026) జరుపుకుంటారు.. బిర్యానీ కేవలం ఒక ఆహారం కాదు, మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అదొక మధురమైన అనుభూతి.. పర్షియన్ సంప్రదాయం నుండి పుట్టి, మొఘలుల కాలంలో రూపుదిద్దుకున్న ఈ ఘుమఘుమలాడే బిర్యానీ.. రుచిని అంతా ఆస్వాదిస్తారు.

హైదరాబాద్ దేనికి స్పెషల్ అని ఎవరిని అడిగినా అందరూ చెప్పే సమాధానం బిర్యానీ.. నోరూరించే హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఎవరికైనా నోట్లో నీళ్లూరాల్సిందే. అంత టేస్టీ బిర్యానీ హైదరాబాద్ కే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. వేడుక ఏదైనా బిర్యానీ తప్పనిసరిగా ఉండాల్సిందే. బిర్యానీని ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలని బిర్యానీ ప్రియులు కోరుకుంటారు. ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో ప్రజలు ఎక్కువగా తినే ఐటమ్ బిర్యానీనే అని తేలింది.. నగరవాసులు వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా హైదరాబాద్ బిర్యానీని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

హైదరాబాద్ దమ్ బిర్యానీ..

హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒక్కటి చాలు ఎవరికైనా నోరూరడానికి. దీనికి తోడు పచ్చిమిర్చి బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, చిట్టి ముత్యాల కోడి బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, మొగలాయ్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, కుండ బిర్యానీ, బాంబూ చికెన్ బిర్యానీ వంటి వందల రకాల బిర్యానీలను హైదరాబాద్ ప్రజలు నిత్యం ఆస్వాదిస్తుంటారు. వంటకాల్లో బిర్యానీని ఢీ కొట్టే ఐటమ్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్లో గల్లీకో బిర్యానీ సెంటర్ ఉన్నా, ప్రతి హోటల్లో ఒక ప్రత్యేక వెరైటీ బిర్యానీ ఉంటుంది. అసలు బిర్యానీ ముద్ద దిగందే హైదరాబాద్ వాసులకు రోజు గడవదనే చెప్పాలి. హైదరాబాదీలు అంటేనే బిర్యానీ లవర్స్. దేశంలో బిర్యానీ నచ్చని వారు, ఆ రెసిపీని మెచ్చని వారే ఉండరు.

ఎన్నో ప్రాంతాలు.. మరెన్నో రుచులు..

మనుషులు ప్రాంతాలు మారినట్లే, బిర్యానీ కూడా మన వెంటే వచ్చేసింది. హైదరాబాద్ వచ్చి ఇక్కడి బిర్యానీ తిని, తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ బిర్యానీ చేసుకుని ఆస్వాదిస్తూ ఉంటారు. అలా దేశంలో పలు ప్రాంతాలకు విస్తరించిన బిర్యానీ.. ఆంధ్రా స్టైల్ బిర్యానీగా.. చంపారన్ బిర్యానీగా, దొన్నే బిర్యానీగా, కోల్కతా, మొరాదాబాద్ బిర్యానీగా.. ఇలా ప్రాంతాల వారీగా.. ఆయా పేర్లతో ఫేమస్ బిర్యానీగా రూపాంతరం చెందింది. నిజానికి బిర్యానీ అనేది స్థానిక వంటకంగా పేరు పొందినప్పటికీ, ఇది వచ్చింది మాత్రం పరాయి దేశం నుంచే. బిర్యానీ అన్న పదం బిరింజ్ బిరియాన్ అనే పర్షియన్ పదం నుండి పుట్టింది. ఇది పర్షియాలో పుట్టిందని, అక్కడి నుంచి ఇండియాకు ప్రయాణం చేసిందని చెబుతారు. పేరు ఏదైనా, దాని అసలుసిసలైన రుచి మాత్రం హైదరాబాద్ బిర్యానీకి చెందిందే కావడంతో ప్రజలు దీనిని అమితంగా ఇష్టపడతారు.

అయితే.. అమెరికా మొదలుకొని ఆఫ్రికా వరకు ఇప్పుడు అన్ని దేశాల్లో బిర్యానీ దొరుకుతోందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ విధంగా బిర్యానీ వండుకున్నా, హైదరాబాద్ దమ్ బిర్యానీ మాత్రం వరల్డ్ ఫేమస్ గా నిలుస్తుంది. చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాల పేరు చివర బిర్యానీ చేరకపోతే దానికి పరిపూర్ణత లేనట్టేనని భోజన ప్రియులు భావిస్తుంటారు.. ఏది ఏమైనా.. మన బిర్యానీ రుచిలో మాత్రం ఏది సాటిరాదు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us