
చలికాలం వచ్చిందంటే చాలు బాడీ పెయిన్స్, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ కాలంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఆహారాలలో నువ్వులు ఒకటి. కేవలం ఒక చెంచా నువ్వులను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు.
ఆయుర్వేదం ప్రకారం.. నువ్వులకు శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచే గుణం ఉంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడి ఎముకల నొప్పులు వస్తుంటాయి. నువ్వుల్లో ఉండే అధిక కాల్షియం, మెగ్నీషియం ఎముక సాంద్రతను పెంచి బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. ఇందులో ఉండే లిగ్నన్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. చలికాలంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. నువ్వుల్లో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చలికాలంలో వచ్చే అలసట, నీరసాన్ని తగ్గించి మూడ్ మెరుగుపరచడంలో నువ్వుల్లోని మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.
నువ్వులను నేరుగా తినడం బోర్ కొడితే ఈ పద్ధతుల్లో మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు..
నువ్వుల లడ్డు: బెల్లం, నువ్వులతో చేసిన లడ్డులు చలికాలపు బెస్ట్ ఎనర్జీ స్నాక్.
సలాడ్లు – సూప్స్: మీరు తాగే వేడి వేడి సూప్‌లలో లేదా తినే సలాడ్లపై కొద్దిగా కాల్చిన నువ్వులను చల్లుకోండి.
పెరుగుతో కలిపి: అదనపు పోషణ కోసం పెరుగు లేదా రైతాలో నువ్వులను కలిపి తీసుకోవచ్చు.
కూరగాయలతో: కూరలు వండేటప్పుడు లేదా బేకింగ్ చేసేటప్పుడు నువ్వుల పొడిని వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా అందుతుంది.
నువ్వులు చిన్నగా కనిపించినా వాటిలో దాగి ఉన్న పోషకాలు మాత్రం కొండంత. అందుకే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.