AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

చిన్నప్పుడు వర్షంలో బాగా తడిసి, వణుకుతూ ఇంటికి రాగానే అమ్మ చేతి వేడి వేడి అల్లం టీ ఇచ్చేది. అప్పట్లో అది కేవలం అమ్మ చూపించే ప్రేమ అనుకునేవాళ్లం. వర్షంలో తడిసి ఇంటికొచ్చిన ప్రతిసారీ మనం తాగే అల్లం టీ వెనుక తరాల నాటి ఆరోగ్య రహస్యం దాగి ఉంది. దాని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Benefits Of Ginger Tea In Rainy Season
Krishna S
|

Updated on: Jul 11, 2026 | 7:33 AM

Share

చిన్నప్పుడు మనలో చాలా మందికి ఒక అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఎంత మారాం చేసినా ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలకి అస్సలు టీ ఇచ్చేవారు కాదు. ‘‘నీకింకా టీ తాగే వయసు రాలేదు’’ అంటూ సున్నితంగా తిరస్కరించేవారు. కానీ వర్షాకాలం వస్తే మాత్రం ఈ నియమం వాటంతట అదే బద్దలైపోయేది. తొలకరి జల్లుల్లో తడుస్తూ, వణుకుతూ, తుమ్ములతో పిల్లలు ఇంటికి రాగానే.. అమ్మో, నానమ్మో వంటగదిలోకి వెళ్లి గరం గరం అల్లం టీ చేసి ఇచ్చేవారు. ఆ వేడి వేడి టీతో పాటు ప్లేట్ నిండా వేడి పకోడీలు కూడా తోడయ్యేవి. అప్పట్లో అది కేవలం మనపై చూపించే ప్రేమ, శ్రద్ధ అనుకునేవాళ్ళం. కానీ వర్షంలో తడిసిన వెంటనే అల్లం టీ ఇవ్వడం వెనుక కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఒక బలమైన కారణం, సైన్స్ కూడా ఉన్నాయి.

అల్లంలో ఏముంది? ఎందుకు అంత పవర్ ఫుల్?

అల్లంలో జింజెరాల్ వంటి సహజసిద్ధమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గొంతు గరగరగా ఉన్నా, ముక్కు బ్లాక్ అయినా, లేదా ఒళ్లు నొప్పులుగా అనిపించినా అల్లం టీ తాగిన వెంటనే ఉపశమనం లభిస్తుంది. వర్షంలో తడిసినప్పుడు ఈ వేడి వేడి అల్లం టీ మన శరీరానికి తక్షణ వెచ్చదనాన్ని అందించి, చలి వల్ల వచ్చే వణుకును తగ్గిస్తుంది.

వర్షంలో తడిసిన వెంటనే తాగితే వచ్చే లాభాలు..

వర్షపు నీటిలో ఎక్కువసేపు తడవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఇలాంటి సమయంలో అల్లం టీ తాగడం వల్ల పడిపోయిన శరీర ఉష్ణోగ్రతను పెంచి, బాడీని వెచ్చగా ఉంచుతుంది. గొంతు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. వేడి టీ నుండి వచ్చే ఆవిరి మరియు అల్లం ఘాటు మూసుకుపోయిన ముక్కును ఫ్రీ చేస్తాయి. అందుకే మన పూర్వీకులు, నానమ్మలు వర్షాకాలంలో దీనిని ఒక అద్భుతమైన హోమ్ రెమెడీగా భావించేవారు.

ఇది జలుబు, దగ్గును పూర్తిగా నయం చేస్తుందా?

అల్లానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. కేవలం వర్షంలో తడవడం వల్ల వచ్చిన స్వల్ప చలి, లేదా ప్రాథమికంగా మొదలయ్యే జలుబు, తుమ్ముల నుండి ఇది ఖచ్చితంగా ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీ జలుబు లేదా జ్వరం తీవ్రమైన వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వల్ల వస్తే మాత్రం, అల్లం టీ కేవలం లక్షణాల తీవ్రతను కొద్దిగా తగ్గించగలదే తప్ప, దానికి పూర్తి చికిత్స కాదు.

వర్షం పడగానే ఇంట్లో అల్లం దంచే శబ్దం వినిపించడం వెనుక తరాల నాటి అనుభవం దాగి ఉంది. అది కేవలం ఒక కప్పు టీ మాత్రమే కాదు.. వర్షపు చలిలో గుండెను తాకే అమ్మ ప్రేమ, మన ఆరోగ్యం పట్ల చూపించే శ్రద్ధకు ప్రతీక. అందుకే ఈ రోజుల్లో కూడా కొద్దిగా వాతావరణం చల్లబడినా, ఒళ్లు నొప్పులుగా అనిపించినా మన మనసు మొదట వెతికేది ఆ అల్లం టీ కోసమే..

Follow Us