
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫిట్‌నెస్ కలిగిన క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ పేరు ముందు వరుసలో ఉంటుంది. మైదానంలో ఆయన చూపించే వేగం, గంటల తరబడి బ్యాటింగ్ చేసినా అలసిపోని తత్వం వెనుక ఒక క్రమశిక్షణతో కూడిన ఆహార నియమావళి ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కోహ్లీ తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నారు. మాంసాహారాన్ని వదిలేసి మొక్కల ఆధారిత ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎంతో ఇష్టమైన, శక్తినిచ్చే ‘సూపర్ ఫుడ్ సలాడ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సలాడ్ ప్రత్యేకత ఏంటి, దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఈ సలాడ్ కేవలం రుచి కోసమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కండరాల రక్షణకు, వేగంగా కోలుకోవడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా క్రీడాకారులు తమ స్టామినాను నిలబెట్టుకోవడానికి ఇలాంటి సమతుల్య ఆహారం ఎంతో అవసరం. ఈ సూపర్ ఫుడ్ సలాడ్‌ను కోహ్లీ నడుపుతున్న ‘వన్ 8 కమ్యూన్’ రెస్టారెంట్ మెనూలో కూడా చేర్చారంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సలాడ్ తయారీకి రోకెట్ లీవ్స్, ఉడికించిన క్వినోవా, కాల్చిన బెల్ పెప్పర్స్ (క్యాప్సికమ్), పుచ్చకాయ ముక్కలు, గుమ్మడి గింజలు, జీడిపప్పు అవసరం అవుతాయి. ఇక దీనికి ప్రత్యేక రుచిని ఇచ్చే డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్, వెనిగర్, తేనె, మస్టర్డ్ సాస్, చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకోవాలి.
ముందుగా ఒక చిన్న గిన్నెలో ఆలివ్ ఆయిల్, వెనిగర్, తేనె, మస్టర్డ్ సాస్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి. ఇది సలాడ్ కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ తర్వాత క్వినోవాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో రోకెట్ లీవ్స్ వేసి, అందులో ఉడికించిన క్వినోవా, కాల్చిన బెల్ పెప్పర్ ముక్కలు, ఐస్ క్రీమ్ స్కూపర్‌తో తీసిన పుచ్చకాయ బాల్స్ వేయాలి. పైన మనం సిద్ధం చేసుకున్న డ్రెస్సింగ్‌ను పోసి అన్ని ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. చివరగా క్రంచీగా ఉండటం కోసం పైన గుమ్మడి గింజలు, జీడిపప్పు ముక్కలు చల్లుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్ సలాడ్ రెడీ అయిపోతుంది.
సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచి ఉండదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ కోహ్లీ తీసుకునే ఈ సలాడ్ ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచిని కూడా అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు లేదా రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకునే వారు తమ డైట్‌లో దీనిని చేర్చుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ సింపుల్ రెసిపీ మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో ఒక గేమ్ చేంజర్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి!