Fish: చేపలంటే ఇష్టమా.. వాటిని తినేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

చేపలంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరు. రుచికరమైన సీఫుడ్​ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అయితే, ప్రపంచంలో కొన్ని రకాల చేపలు ఉన్నాయి, వాటిని సరైన విధంగా శుభ్రం చేయకపోయినా, వండడంలో చిన్న పొరపాటు జరిగినా అది తినే వ్యక్తికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ..

Fish: చేపలంటే ఇష్టమా.. వాటిని తినేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Puffer Fishes

Updated on: Dec 17, 2025 | 6:15 AM

చేపలంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరు. రుచికరమైన సీఫుడ్​ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అయితే, ప్రపంచంలో కొన్ని రకాల చేపలు ఉన్నాయి, వాటిని సరైన విధంగా శుభ్రం చేయకపోయినా, వండడంలో చిన్న పొరపాటు జరిగినా అది తినే వ్యక్తికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని అరుదైన చేపల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన విషాలు మనిషి నరాల వ్యవస్థపై దాడి చేసి నిమిషాల వ్యవధిలో మరణానికి కారణమవుతాయి. అలాంటి ప్రమాదకరమైన చేపల గురించి తెలుసుకుందాం.

పఫర్ ఫిష్

ప్రమాదకరమైన చేపల్లో ముందుగా చెప్పుకోవాల్సింది పఫర్ ఫిష్​. దీనిని జపాన్‌లో ఫుగు అని కూడా పిలుస్తారు. ఈ చేప కాలేయం, కళ్లు, ఇతర అవయవాలలో టెట్రోడోటాక్సిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషం పేరుకుపోయి ఉంటుంది. ఈ విషం సైనేడ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనది. ఈ చేపను తిన్న తర్వాత కేవలం 20 నిమిషాల నుంచి మూడు గంటల్లోపే దీని లక్షణాలు కనిపిస్తాయి.

మొదట పెదవులు, నాలుక తిమ్మిరిగా మారి, వాంతులు, తలనొప్పి మొదలవుతాయి. క్రమంగా శరీరం పూర్తిగా కదలకుండా పోతుంది. చివరికి శ్వాస పూర్తిగా ఆగిపోయి, మరణం సంభవిస్తుంది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ విషానికి ఇప్పటివరకు ఎలాంటి విరుగుడు లేదు. అందువల్ల సరైన శిక్షణ లేకుండా ఈ చేపను తయారు చేయడం ప్రాణాలకు పెను ప్రమాదం.

సలేమా పోర్జీ

ప్రమాదకరమైన చేపల్లో మరొకటి సలేమా పోర్జీ, దీనిని డ్రీమ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపను తినడం వల్ల నేరుగా ప్రాణాపాయం లేకపోయినా, దీని తలను తింటే వింత అనుభవాలు కలుగుతాయి. వింత శబ్దాలు వినిపించడం, భయంకరమైన భ్రాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని ప్రభావం కొన్ని మాదకద్రవ్యాల మాదిరిగానే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా, పగడపు దిబ్బల దగ్గర కనిపించే చాలా అందంగా ఉండే కొన్ని రకాల చేపల్లో కూడా సిగ్వాటాక్సిన్ అనే ప్రమాదకరమైన విషాలు దాగి ఉంటాయి.

ఈ విషం నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, చేపలు తినేటప్పుడు, ముఖ్యంగా మీరు ఎప్పుడూ తినని కొత్త లేదా అరుదైన రకాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాటిని వండే విధానం, శుభ్రపరిచే పద్ధతి, వాటి రకం గురించి పూర్తి అవగాహన ఉండటం ముఖ్యం. తెలియని చేపలను తినే సాహసం చేయకపోవడమే ఉత్తమం.