
ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం.. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. వీటిని బక్షాలు, పూరణ్ పోలి అని కూడా అంటారు. ఈ తియ్యని వంటకం స్వీట్ షాప్స్‌లో లభించే రుచికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వీట్ షాపుల్లో ఉన్నట్టుగా మృదువైన, రుచికరమైన బక్షాలను సులభ పద్ధతిలో ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, చల్లారిన తర్వాత కూడా అదే మృదుత్వాన్ని, రుచిని నిలుపుకునే ఈ నేతి బక్షాలు పండుగ ప్రత్యేకతను మరింత పెంచుతాయి.
బక్షాల తయారీకి కావాల్సిన పదార్థాలు:
పిండి కోసం: ఒక కప్పు మైదా పిండి, అర కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, నెయ్యి రెండు-మూడు టేబుల్ స్పూన్లు, నీరు (పిండి కలపడానికి సరిపడా తీసుకోవాలి. ఇక పూర్ణం కోసం ఒక కప్పు పచ్చి శనగపప్పు సుమారు 200 గ్రాములు, ఒకటీ పావు కప్పు తురిమిన బెల్లం తీపి తక్కువ కావాలంటే ఒక కప్పు, అర టీస్పూన్ నెయ్యి పప్పు ఉడికించడానికి, నాలుగు-ఐదు యాలకులు పొడి చేసుకోవాలి. నెయ్యి పూర్ణంలో కలపడానికి ఒకటి-రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.
ఇక తయారీ విధానం:
ముందుగా పిండి తడిపి తయారు చేసుకోవాలి. మొదటగా ఒక గిన్నెలోకి జల్లెడ పట్టిన మైదా పిండి, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. మైదా పిండి మాత్రమే వాడితే చల్లారిన తర్వాత బొబ్బట్లు గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి, గోధుమ పిండిని కలపడం వల్ల మృదుత్వాన్ని ఇస్తుంది. కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిని మెత్తగా, కొద్దిగా జిగురుగా అయ్యేంత వరకు కలపాలి. పిండి బాగా కలిసిన తర్వాత, చేతికి, గిన్నెకు అతుక్కోకుండా ఉండటానికి రెండు-మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపాలి. రుచి కోసం ఆవు నెయ్యి వాడటం మంచిది. కలిపిన పిండి పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి, మూత పెట్టి కనీసం అరగంట నుండి గంటసేపు నానబెట్టాలి. సమయం ఉంటే రెండు-మూడు గంటలు నానబెడితే పిండి మరింత సాఫ్ట్‌గా తయారవుతుంది.
ఇక ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవాలి. దీనికోసం మరొక గిన్నెలో ఒక కప్పు పచ్చి శనగపప్పును తీసుకొని, రెండు-మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీరు పోసి గంటసేపు నానబెట్టాలి. నానబెట్టిన పప్పును కుక్కర్‌లోకి తీసుకొని, రెండు కప్పుల నీరు, అర టీస్పూన్ నెయ్యి చేర్చి, మూత పెట్టి నాలుగు-ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడకడం ముఖ్యం. ఉడికిన పప్పులో మిగిలిన నీటిని వడగట్టడానికి స్ట్రైనర్‌లో వేసి ఐదు-పది నిమిషాలు ఉంచాలి. ఈ పప్పు నీటిని కట్టు చారు లేదా రసంలో వాడుకోవచ్చు. నీరంతా పోయిన తర్వాత పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకొని, మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుని పూర్ణం మిశ్రమం తయారు చేసుకోవాలి. ఒక పాన్‌లో తురిమిన బెల్లాన్ని ఒక కప్పు శనగపప్పుకు ఒకటి పావు కప్పు బెల్లం తీసుకోవాలి. తీపి తగ్గించాలంటే ఒక కప్పు సరిపోతుంది. ఇందులో ఒకటి-రెండు టీస్పూన్ల నీరు చేర్చి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, మంచి సువాసన కోసం యాలకుల పొడిని చేర్చాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పప్పు పేస్ట్‌ను బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు-ఆరు నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం లడ్డు చుట్టడానికి వీలుగా గట్టిగా, ముద్దలా మారాలి. పూర్ణం పల్చగా ఉంటే బొబ్బట్లు చేసేటప్పుడు బయటకు రావచ్చు కాబట్టి, సెమీ-సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పూర్ణం మరింత గట్టిపడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి, పూర్ణాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, ఒకటి-రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి చేర్చి బాగా కలపాలి. ఇది పూర్ణానికి అదనపు రుచిని, మృదుత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు పూర్ణాన్ని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పూర్ణాన్ని మూడు-నాలుగు రోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు లేదా పూర్ణం బూరెలు చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు బక్షాలు తయారు చేసుకోవాలి. నానిన పిండిని మరోసారి బాగా కలిపి, చిన్న నిమ్మకాయ సైజు ముద్దలుగా తీసుకోవాలి. బటర్‌పేపర్ లేదా అరటి ఆకు/ఆయిల్ ప్యాకెట్‌కు కొద్దిగా నెయ్యి అప్లై చేసి, పిండి ముద్దను దానిపై ఉంచి లైట్‌గా వత్తాలి. మధ్యలో పూర్ణం ఉండను పెట్టి, పిండితో పూర్తిగా మూసివేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసివేయవచ్చు. ఇప్పుడు బొబ్బట్టును చేత్తో నెమ్మదిగా వత్తుతూ గుండ్రంగా, ఒక మోస్తారు పల్చగా ఉండేలా చేయాలి. పిండి, పూర్ణం మృదువుగా ఉండటం వలన చేతితో సులభంగా చేయవచ్చు.
ఇప్పుడు నెయ్యి రాసిన వేడి పెనంపై చేత్తో చేసుకున్న బక్షాలను వేసి మీడియం మంట పైన కాల్చాలి. సుమారు పది సెకన్ల తర్వాత పిండి పైన కొద్దిగా పారదర్శకంగా మారుతుంది. అప్పుడు మరో వైపుకు తిప్పి, పది సెకన్ల పాటు కాల్చాలి. మళ్లీ తిప్పి, నెయ్యి వేస్తూ కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల బక్షాలు చక్కగా పొంగుతాయి, గోధుమ రంగులోకి మారతాయి. కాల్చిన బక్షాలను హాట్ బాక్స్‌లో లేదా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ విధానంలో ఒక్కొక్కటిగా బక్షాలను తయారు చేసుకోవాలి.
ఈ పద్ధతిని అనుసరించి తయారుచేసిన నేతి బక్షాలు చల్లారిన తర్వాత కూడా మృదుత్వాన్ని, గొప్ప రుచిని ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. పండుగ రోజున ఎటువంటి ఆందోళన లేకుండా సులభంగా, పర్ఫెక్ట్‌గా బొబ్బట్లను తయారు చేసి, కుటుంబ సభ్యులతో పంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..