కొన్ని రోజులుగా ఎండలు ముదిరిపోతున్నాయి. వేసవి రాకముందే మండిపోతున్న ఈ ఎండలలో చాలా జగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సీజన్‌లో దగ్గు, జలుబులు కొందరిని వేధిస్తుంటాయి. ఈ కాలంలో శరీరం వేడిగా కూడా ఉంటుంది. ఈ వేడి కారణంగా మరికొందరిని విరేచనాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, ఈ కాలంలో తీసుకునే పదార్థాలపై ఓ కన్నేసి ఉండడం చాలా మంచిందని నిపుణులు సూచన. లేదంటే కడుపులో మంట, ఎసిడిటీ లాంటి సమస్యలు ఎన్నో చుట్టుముట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నీళ్లు సరిపడినంతగా తాగకపోయినా, కొన్ని పదార్థాలను అతిగా తీసుకున్నా ఎన్నో చిక్కుల్లో పడాల్సి ఉంటుందని వారు పదేపదే గుర్తు చేస్తున్నారు. ఆయా పదార్థాలను పరిమితంగా తింటే ఆరోగ్యానికి మంచిదే. అయితే పరిమితికి మించితే.. ముఖ్యంగా వేసవిలో ప్రమాదకరం కాగలవు. మరి వేసవిలో మితంగా తీసుకోవలసిన ఆహారాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మసాలాలు, కారం, నాన్‌వెజ్: ఎండాకాలంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమ్యలతోపాటు, ఒంట్లో అధిక కొవ్వు కూడా చేరే అవకాశం ఉంది. అలాగే పొట్టలో మంటను కూడా కలిగిస్తాయి. వీటితోపాటు కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోకూడదు.
బేకరీ, జంక్ ఫుడ్స్: జంక్స్ ఫుడ్స్‌తోపాటు, బేకరీ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే దాహం ఎక్కువగా వేస్తుంది. అలాగే ఇవి శరీరంలో నీటి శాతాన్ని విపరీతంగా తగ్గిస్తాయి. అందుకే ఈ ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.
నూనె పదార్థాలు: వేసవిలో నూనె పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. విరేచనాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నూనె పదార్థాలు దప్పికను పెంచడంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడేలా చేసేందుకు అవకాశంఉంది. అందుకే నూనెతో చేసిన పదార్థాలకు ఈ కాలంలో దూరంగా ఉండాలి.
మామిడి కాయలు: వేసవిలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని పరిమితంగా తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. అలా కాదని, విపరీతంగా లాగిస్తే మాత్రం, శరీరంలో విపరీతంగా వేడి పెరుగుతుంది. ఫలితంగా విరేచనాలతో ఇబ్బంతి పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ పదార్థమైనా పరిమితంగా తీసుకుంటేనే మంచింది.
మద్యం: ఈ సీజన్‌లో దాహం ఎక్కువగా అవుతుంటుంది. ఇక మద్యం అతిగా తీసుకుంటే, అధికంగా దప్పిక వేస్తుంది. ఎక్కువగా దాహం వేయడంతో నాలుక పొడిబారుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల వేసవి కాలంలో సాధ్యమైనంతవరకు మద్యానికి దూరంగా ఉండడం మంచిది.
టీ, కాఫీలు: టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ బారిన పడే అవకాశం ఉంది. అందుకే వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ, వాటర్ మిలాన్ జ్యూస్, కర్బూజా జ్యూస్, కీరదోస కాయలు లాంటివి తీసుకోవడం మంచింది. వీటిని తీసుకుంటే మన శరీరంలో నీటి శాతాన్ని పుష్కలంగా ఉంచేలా చేస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..