మరో ఐదు రోజుల్లో దీపావళి పండగ రానుంది. ఫెస్టివల్‌ను వేడుకగా జరుపుకొనేందుకు చాలామంది ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుస్తుల షాపింగ్, టపాసుల కొనుగోలు తదితర కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక పండగన్నాక పసందైన విందులు ఉండాల్సిందే. స్వీట్స్, కేక్స్ అంటూ ఎన్నో రుచికరమైన వంటకాలను ఆస్వాదించాల్సిందే. అయితే పండగ పూట ఏది పడితే అది తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. అజీర్తి, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ నేపథ్యంలో జీర్ణ సంబంధ సమస్యలను అధిగమించి దీపావళిని సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ 5 మంచి చిట్కాలను పంచుకున్నారు.
రోజును ఇలా ప్రారంభించండి..
1. గుల్ కంద్ నీటితో రోజును ప్రారంభించాలి. గులాబీ రేకుల్లోని పోషకాలు ఎసిడిటీ, మలబద్ధకం, వికారం సమస్యలను నివారించడంలో సమర్థంగా పనిచేస్తాయి.
2. మధ్యాహ్న భోజనంలో కనీసం ఒక అరటి పండైనా చేర్చుకోండి. ఇది ఆహారం జీర్ణం కావడంలో సహాయ పడుతుంది.
3. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో కనీసం ఓ 15 నిమిషాల పాటు కునుకు తీయండి.
4. సాయంత్రం సమయంలో 2 నుంచి 5 నిమిషాల పాటు సుప్త బద్ధ కోణాసనం వేయండి. దీనేనే Reclining Bound Angle Pose అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల గుండె, ఇతర శరీర భాగాల్లో రక్త ప్రసరణ మరింత మెరుగ్గా జరుగుతుంది. అయితే మొదటిసారి ఈ ఆసనం వేస్తున్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి.
5. డిన్నర్‌లోకి రైస్ వాటర్ (బియ్యం ఉడికించిన గంజి)ని నెయ్యితో కలిపి తీసుకోవాలి. ఇందులోని ప్రొ బయాటిక్స్ జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా జీవక్రియ రేటును పెంచుతుంది.
Also Read: