
Kaju Paneer Pulao
రాయల్ విందులో కూడా ప్రధాన స్థానం చోటు చేసుకున్న పులావ్.. కాజు పనీర్ పులావ్. దీనిని శాఖాహారులు కూడా అమితమైన ఇష్టంతో తింటారు. అన్నం నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాల సువాసనల మధ్య మెత్తటి పన్నీర్ ముక్కలు. జీడి పప్పు కలిసిన గొప్ప వంటకంకాజు పనీర్ పులావ్. ఈ కాజు పనీర్ పులావ్ ని మీ వంటగదిలోనే రెస్టారెంట్ స్టైల్ లో రాయల్ లుక్ లో రుచికరంగా తయారు చేసుకోవచ్చు, వేడి వేడి కాజు పనీర్ పులావ్ ప్లేట్ ని అందిస్తే అతిధులు ఆహా ఏమి రుచి అంటూ మైమరచి తినాల్సిందే. ఈ రోజు ఈ పులావ్ తయారీ గురించి తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్థాలు
- బాస్మతి బియ్యం: 2 కప్పులు (బాగా శుభ్రంగా కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి)
- పనీర్: 250 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
- కాజు – ఒక కప్పు
- ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగాలి లేదా పొడవుగా ముక్కలుగా కోయాలి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
- పచ్చిమిర్చి: 2-3 ( నిలువుగా కట్ చేయాలి)
- పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి లేదా నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
- బే ఆకు: 1
- దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
- యాలకులు: 4
- లవంగాలు: 4
- మిరియాలు: 5
- జీలకర్ర: 1 టీస్పూన్
- పసుపు: 1/2 టీస్పూన్
- కారం: 1/2 టీస్పూన్ (రుచికి తగ్గట్టుగా)
- ధనియాల పొడి: 1 స్పూన్
- గరం మసాలా: 1/2 టీస్పూన్
- కొత్తిమీర తరుగు: సన్నగా తరిగినవి (అలంకరించడానికి)
- పుదీనా: (సన్నగా తరిగినవి, ఐచ్ఛికం)
- ఉప్పు: రుచికి తగినంత
- నీరు: సుమారు 3.5 నుంచి 4 కప్పులు)
కాజూ పనీర్ పులావ్ ఎలా తయారు చేయాలంటే
- ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని తీసివేసి.. బియ్యంలోని అదనపు నీటిని బయటకు తీయడానికి జల్లెడలో వేసి వడకట్టండి.
- పనీర్ ని ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేసి.. నీరు లేకుండా చేసి కావాల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేయండి.
- దీని తరువాత గ్యాస్ స్టావ్ మీద పాన్ పెట్టి కొంచెం నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. పనీర్ ముక్కలను బంగారు రంగులోకి మారే వరకు తేలికగా వేయించాలి. ఇలా చేయడం వల్ల పనీర్ విరిగిపోకుండా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది.
- తరువాత పనీర్ తీసి ఒక ప్లేట్ లో వేసుకుని మిగిలిన నెయ్యి లేదా నూనెను అదే పాన్ లో వేయండి. కొంచెం జీడి పప్పు ని వేసి వేయించి పన్నీర్ తీసుకున్న ప్లేట్ లోకి తీసుకోండి.
- నూనె వేడెక్కిన తర్వాత.. అన్ని మసాలా దినుసులు (బే ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర) వేసి మంచి వాసన వచ్చే వరకు కొన్ని సెకన్ల పాటు వేయించండి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- దీని తరువాత.. మంటను తగ్గించి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి.
- తర్వాత వెంటనే పెరుగు వేసి, పెరుగు విరగకుండా నిరంతరం కలుపుతూ ఉండండి. నూనె వేరు కావడం ప్రారంభమయ్యే వరకు ఈ ఉల్లి మసాలా మిశ్రమంలో పెరుగుని 3 నిమిషాలు వేయించండి.
- ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి.. బియ్యం విరిగిపోకుండా మెల్లగా కలపండి. తర్వాత సరిపడా నీళ్లు, ఉప్పు, మిగిలిన జీడి పప్పు వేసి కలపండి.
- తరువాత నీరు మరిగే వరకూ ఉంచి.. వేయించిన పనీర్, జీడిపప్పు, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులువ వేసి మెల్లగా కలపండి. మంటను స్విమ్ లో పెట్టి పాన్‌కి సరిపడా మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు
తక్కువ మంట మీద ఉడికించండి. (మధ్యలో మూత తెరవవద్దు).
- 20 నిమిషాల తర్వాత.. స్టవ్ ఆపి పులావ్‌ను 5-10 నిమిషాలు మూతపెట్టి (దమ్ మీద) ఉంచండి. ఇలా చేయడం వల్ల బాస్మతి బియ్యం పూర్తిగా ఉడుకుతుంది.
ఇప్పుడు మూత తీసి.. ఫోర్క్ సహాయంతో పులావును నెమ్మదిగా కలపండి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో కాజు పనీర్ పులావ్ రెడీ. దీనిని వేడి వేడిగా అతిధులకు రైతా, ఊరగాయ లేదా మీకు ఇష్టమైన కూరతో అందించండి. తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే..