
బొప్పాయి.. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి బరువు తగ్గడం వరకు దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చలికాలం రాగానే చాలామంది బొప్పాయిని తినడానికి వెనుకాడతారు. దీనికి చల్లబరిచే స్వభావం ఉండటం వల్ల జలుబు, దగ్గు వస్తుందని భయపడుతుంటారు. మరి చలికాలంలో బొప్పాయి తినడం సురక్షితమేనా? ఢిల్లీలోని GTB హాస్పిటల్ మాజీ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అనామిక గౌర్ ఈ విషయంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సాధారణంగా చలికాలంలో మన శారీరక శ్రమ తగ్గుతుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో బొప్పాయి మనకు ఒక మంచి స్నేహితుడి లాగా పనిచేస్తుంది.
జీర్ణక్రియకు అమృతం: బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా అరిగించేలా చేస్తుంది. పేగులను శుభ్రంగా ఉంచి గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తి: ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
బరువు నియంత్రణ: చలికాలంలో కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటుంటాం. బొప్పాయిలో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.
బొప్పాయి ప్రయోజనాలు అందాలంటే సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. రోజుకు 5 నుండి 6 ముక్కలు లేదా సుమారు 200 గ్రాములకు మించి తీసుకోకపోవడం మంచిది.
బొప్పాయి ఆరోగ్యకరమైనదే అయినా చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరి.
ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే తినవద్దు: చల్లని బొప్పాయిని తినడం వల్ల గొంతు సమస్యలు రావచ్చు. తినడానికి గంట ముందే ఫ్రిజ్ నుండి తీసి, గది ఉష్ణోగ్రతకు వచ్చాక తినాలి.
జలుబు ఉంటే దూరం ఉండాలి: ఇప్పటికే తీవ్రమైన జలుబు, దగ్గు లేదా ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఈ పండును నివారించడం ఉత్తమం. ఒకవేళ తినాలనిపిస్తే, తిన్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగాలి.
మితంగా తినండి: మీ శరీర తత్వం చల్లనిదైతే, అతిగా తినకుండా జాగ్రత్త పడండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.