దావత్ అంటే బిర్యానీ అని మరోసారి తేలిపోయింది. 2024లో దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ ఏడాదికి సంబంధించిన జొమాటో ఫుడ్ డెలివరీల్లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ మేరకు జొమాటో 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర వివరాలను వెల్లడించింది. జొమాటోలో వరుసగా 9వ ఏడాది బిర్యానీయే అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇటీవల స్విగ్గీ రిలీజ్ చేసిన 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్‌లోనూ బిర్యానీయే దేశంలో అగ్రస్థానంలో నిలవగా.. ఇందులోనూ చికెన్ బిర్యానీకే ఎక్కువ ఆర్డర్స్ అందినట్లు వెల్లడించింది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 9,13,99,110 బిర్యానీ ఆర్డర్లు అందినట్లు జొమాటో వెల్లడించింది. సగటున ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు అందినట్లు తెలిపింది.
బిర్యానీ తర్వాత అత్యధిక ఫుడ్ ఆర్డర్లు పిజ్జా కోసం వచ్చినట్లు తన నివేదికలో జొమాటో వెల్లడించింది. దేశంలో మొత్తం 5.84 కోట్ల పిజ్జా ఆర్డర్లు వచ్చింది. అలాగే 77.76 లక్షల టీ ఆర్డర్లు, 74.32 లక్షల కాఫీ ఆర్డర్లను జొమాటో డెలివరీ చేసింది. టీ, కాఫీలో కాస్త ఎక్కువగా టీ కోసమే ఆర్డర్లు అందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. జొమాటో నివేదికలో మరిన్ని ఆసక్తికర అంశాలేమెంటే.. ఓ వ్యక్తి 120 మంచూరియాలను ఆర్డర్ చేసి.. రైలు బోకీలోని అందరికీ పంచిపట్టారు.
బెంగుళూరుకు చెందిన ఓ కస్టమర్ ఓ రెస్టారెంట్‌కు వెళ్లి జొమాటో డైనింగ్ కింద రూ.5.13 లక్షల బిల్లు చెల్లించారు. 2024లో సింగిల్ డైనింగ్‌లో అత్యధిక బిల్లు ఇదే కావడం విశేషం. మరో ఆసక్తికర అంశమేమంటే.. ఓ కస్టమర్ ఈ ఏడాది ఏకంగా 1377 వేర్వేరు రెస్టారెంట్లలో ఆర్డర్స్ ఇచ్చి విభిన్న రుచులను ఎంజాయ్ చేశాడు.