చికెన్ స్వీట్ కార్న్ సూప్.. చాలా మందికి ఇది ఇష్టం. రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లారంటే.. ఖచ్చితంగా దీన్ని ఆర్డర్ చేస్తారు. అందులోనూ చలి కాలంలో ఈ సూప్ తాగితే.. బాడీలో వెచ్చదనం పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అయితే ఈ సూప్ తాగడానికి ప్రతి సారీ రెస్టారెంట్లకు వెళ్లలేం కదా. ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట టీ, కాఫీలకు బదులు దీన్ని తాగితే.. టేస్ట్‌తో పాటు ఆరోగ్యం కూడా. ఈ సూప్ చేయడం చాలా సులభం. జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తాగితే చాలా మంచిది. మరి ఈ చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్, స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, ఫ్రెంచ్ బీన్స్ తరుగు, పంచదార, అరోమేటిక్ పౌడర్, నల్ల మిరియాల పౌడర్, ఉప్పు, తెల్ల మిరియాల పొడి, బీట్ చేసిన గుడ్డు, కార్న్ ఫ్లోర్, ఆయిల్.
ముందుగా స్వీట్ కార్న్ గింజల్ని మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లోతైన గిన్నెలో నీళ్లు పోసి అందులో గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్, చికెన్ వేసి ఉడికించు కోవాలి. మధ్యలో పైన వస్తున్న తేటను తీసేస్తూ ఉండాలి. చికెన్ ఉడికిన తర్వాత క్యారెట్, పంచదార, అరోమేటిక్ పౌడర్, ఫ్రెంచ్ బీన్స్ వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత కోడి గుడ్డును బాగా బీట్ చేసి.. అది కూడా సూప్ ఉడికే మిశ్రమంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలిపిన కార్న్ ఫ్లోర్‌ని కూడా సూప్‌లో వేసుకోవాలి. దీన్ని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ సిద్ధం. దీన్ని ఈ వింటర్ సీజన్‌లో తీసుకుంటే చాలా మంచిది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.