బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే..

బోనాల పండుగలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం అన్నం తెలంగాణ సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. బియ్యం, పెసరపప్పు, పాలు, బెల్లంతో సులభంగా తయారయ్యే ఈ ప్రసాదం రుచికరంగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కూడా కలిగి ఉంటుంది. సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే బోనాల స్పెషల్ బెల్లం అన్నాన్ని సులభంగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే..
Bonalu Special Bellam Annam

Updated on: Aug 07, 2026 | 11:21 AM

బోనాల పండుగ తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఒక సంప్రదాయం. బోనం అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటకాలు. వాటిలో బెల్లం అన్నం ముఖ్యమైనది. బియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు ప్రధాన పదార్థాలుగా చేసుకునే ఈ ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే.. బెల్లం అన్నాన్ని కొన్ని టిప్స్ ద్వారా సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు.. రుచికరమైన, సంప్రదాయ బెల్లం అన్నం తయారీ విధానాన్ని ఈ కథనాన్ని తెలుసుకుందాం..

బెల్లం అన్నం తయారీకి కావలసిన పదార్థాలు:

  • పాలు: 250 మి.లీ (పావు లీటర్)
  • బియ్యం: 1 కప్పు
  • పెసరపప్పు: అర కప్పు
  • బెల్లం: 1 కప్పు
  • నెయ్యి: 3 స్పూన్లు
  • జీడిపప్పు: కొద్దిగా (మీరు కోరుకున్నంత)
  • కిస్మిస్: కొద్దిగా (మీరు కోరుకున్నంత)
  • యాలకుల పొడి: అర స్పూన్
  • నీళ్లు: అవసరాన్ని బట్టి (సుమారు 3 కప్పులు)

దీనిలో కొలతల వారీగా ఇస్తున్నాం.. కావాలంటే.. వీటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు..

తయారీ విధానం:

నానబెట్టడం: ముందుగా బియ్యం, పెసరపప్పులను ఒక గిన్నెలో తీసుకుని, రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. నీటిని వడకట్టి, మళ్ళీ తగినన్ని నీళ్లు పోసి పావుగంట (15 నిమిషాలు) పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నం త్వరగా ఉడుకుతుంది.

వేయించడం: స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని, అందులో రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత, జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత స్టవ్ మీద నుండి తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.

పాలు మరిగించడం: ఒక లోతైన గిన్నె లేదా పాత్రను స్టవ్ మీద పెట్టి, అందులో రెండు కప్పుల పాలు మరియు మూడు కప్పుల నీళ్లు పోయాలి. స్టవ్ ఆన్ చేసి, పాలను బాగా మరగనివ్వాలి. పాలు మరిగి పొంగు వస్తున్నప్పుడు, జాగ్రత్తగా ఉండాలి.

బియ్యం, పెసరపప్పు ఉడికించడం: పాలు బాగా మరిగిన తర్వాత, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని నీళ్లు లేకుండా వడకట్టి, మరుగుతున్న పాలల్లో వేయాలి. వాటిని బాగా కలుపుకోవాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, బియ్యం, పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా చూసుకోవాలి. పాలు మొత్తం దగ్గరకి అయిపోయి, అన్నం గుజ్జుగా మారే వరకు ఉడికించాలి.

బెల్లం కలపడం: బియ్యం, పప్పు పూర్తిగా ఉడికి, మెత్తగా అయిన తర్వాత, చేతితో నొక్కి చూసి నిర్ధారించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసి, అన్నంలో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. బెల్లం కరిగే కొద్దీ ప్రసాదం మరింత తీపిగా, రుచికరంగా మారుతుంది.

చివరి మెరుగులు: బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, అర స్పూన్ యాలకుల పొడి, మిగిలిన ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ పదార్థాలు బెల్లం అన్నానికి అద్భుతమైన సువాసనను, రుచిని అందిస్తాయి.

అన్నింటినీ బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సువాసనభరితమైన, రుచికరమైన బెల్లం అన్నం సిద్ధం. దీనిని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా బోనంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతనే ప్రసాదంగా స్వీకరించాలి.

ఈ బెల్లం అన్నం కేవలం బోనాల పండుగకే కాకుండా, ఇతర శుభకార్యాలకు, పండగలకు కూడా తయారు చేసుకోదగిన సంప్రదాయ వంటకం. ఇది తెలుగు ఇంటి రుచుల గొప్పతనాన్ని చాటుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బోనాల స్పెషల్ బెల్లం అన్నాన్ని ఇలా వండుకోని హ్యపీగా తినండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us