ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
మార్కెట్ నుండి తెచ్చిన టమాటాలు రెండ్రోజులకే అవి మెత్తగా మారి కుళ్లిపోతున్నాయా? ముఖ్యంగా టమాటా ధరలు పెరిగినప్పుడు అవి పాడైపోతే కలిగే బాధ వర్ణనాతీతం. అయితే టమాటాలు ఎక్కువ కాలం గట్టిగా, తాజాగా ఉండాలంటే వాటిని నిల్వ చేసే పద్ధతిలో చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని మీకు తెలుసా? టమోటా కాడ ఏ వైపు ఉండాలి? ఫ్రిజ్‌లో ఎప్పుడు పెట్టాలి? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

భారతీయ వంటకాల్లో టమాటా లేనిదే ఏ కూర పూర్తి కాదు. కూరలకు మంచి రంగును, పులుపును ఇచ్చే టమాటాలను మనం కిలోల కొద్దీ మార్కెట్ నుండి తెచ్చుకుంటాం. అయితే అవి త్వరగా పాడైపోతుంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా వర్షాకాలంలో ఇవి మరీ త్వరగా కుళ్లిపోతుంటాయి. టమోటాల ధరలు పెరిగినప్పుడు అవి పాడైపోతే గృహిణులకు అది పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే టమాటాలు ఎక్కువ కాలం తాజాగా, గట్టిగా ఉండాలంటే మీరు నిల్వ చేసే విధానంలో కొన్ని శాస్త్రీయమైన మార్పులు చేయాలి.
కొనుగోలు చేసేటప్పుడే స్మార్ట్‌గా ఉండండి
చాలామంది తప్పు ఇక్కడే చేస్తారు. బుట్ట నిండా బాగా పండిన ఎర్రటి టమోటాలను నింపేస్తారు. కానీ నిల్వ ఉండాలంటే మీరు మిశ్రమ పద్ధతిని పాటించాలి. వెంటనే వంట కోసం కొన్ని బాగా పండినవి తీసుకోండి. మిగతా వారం రోజుల కోసం కొద్దిగా గట్టిగా, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని ఎంచుకోండి. ఇవి ఇంట్లో ఉండగానే సహజంగా పండుతాయి.
స్టెమ్ డౌన్ కాదు..
టమాటాకు దాని కాడ ఉండే భాగం చాలా సున్నితమైనది. చాలామంది టమాటాలను ఎలా పడితే అలా వేస్తుంటారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం.. టమోటాలను నిల్వ చేసేటప్పుడు కాడ వైపు పైకిఉండేలా ఉంచాలి. కాడ ఉండే భాగం నుండి తేమ త్వరగా బయటకు పోతుంది. అలాగే అక్కడి నుండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాడ వైపు పైకి ఉంచడం వల్ల గాలి ప్రసరణ తగ్గి, టమోటా గట్టిగా ఉంటుంది.
ఫ్రిజ్‌లో పెట్టాలా? వద్దా?
ఇదొక పెద్ద చర్చ. నిజానికి దోర టమాటాలను అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లోని చల్లదనం టమాటాలోని ఎంజైములను దెబ్బతీస్తుంది. దీనివల్ల టమాటా తన అసలు రుచిని, సువాసనను కోల్పోయి చప్పగా మారుతుంది. పండిన టమామాలు బయట ఉంటే కుళ్లిపోతాయి. అందుకే వాటిని మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. వండే ముందు ఒక గంట ముందే బయటకు తీస్తే మళ్లి రుచి తిరిగి వస్తుంది.
గాలి ప్రసరణే ముఖ్యం
టమోటాలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచడం అతిపెద్ద తప్పు. వాటిని వెడల్పాటి వెదురు బుట్టలో లేదా గాలి తగిలే రంధ్రాలున్న పాత్రలో ఉంచండి. ఒకదానిపై ఒకటి పేర్చడం వల్ల కింద ఉన్న టమోటాలపై ఒత్తిడి పెరిగి అవి మెత్తగా మారి నీరు కారుతాయి. కాబట్టి పక్కపక్కనే సర్దడం ఉత్తమం.
తడి లేకుండా జాగ్రత్త పడండి
మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే టమాటాలను కడిగే అలవాటు ఉంటే, వాటిని వెంటనే తూడ్చాలి. తడి ఉన్న టమోటాలపై బూజు త్వరగా పడుతుంది. ఒకవేళ పచ్చి టమాటాలను త్వరగా పండించాలంటే.. వాటిని ఒక కాగితపు కవర్‌లో పెట్టి చీకటిగా ఉండే చోట ఉంచండి. పేపర్ బ్యాగ్ టమాటా విడుదల చేసే ఇథిలీన్ వాయువును లోపలే ఉంచి అది త్వరగా పండేలా చేస్తుంది.
టమాటాల పోషక విలువలు
టమాటా కేవలం రుచి కోసమే కాదు, ఇందులో లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేసినప్పుడే ఈ పోషకాలు మనకు అందుతాయి. కాగా ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ వంటింట్లో టమోటాలు వారం రోజుల పాటు మెరుస్తూ, గట్టిగా ఉంటాయి. తద్వారా మీ డబ్బు ఆదా అవ్వడమే కాకుండా వంటలకు అద్భుతమైన రుచి వస్తుంది.
