భారత్‌ ఆహార భద్రతను సాధించాలంటే ఏం చేయాలి.? నిపుణులు చెబుతున్న సూచనలు ఇవే..

| Edited By: Ravi Kiran

Apr 20, 2022 | 5:06 PM

భవిష్యత్తు తరాలకు సరిపడ ఆహారం విషయంలో ప్రతీ ఒక్కరూ పునఃపరిశీలించుకోవాల్సిన సమయం ఇది. పెరుగుతోన్న జనాభాకు..

భారత్‌ ఆహార భద్రతను సాధించాలంటే ఏం చేయాలి.? నిపుణులు చెబుతున్న సూచనలు ఇవే..
Food Futurism
Follow us on

భవిష్యత్తు తరాలకు సరిపడ ఆహారం విషయంలో ప్రతీ ఒక్కరూ పునఃపరిశీలించుకోవాల్సిన సమయం ఇది. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారత్‌ ఆహార సమృద్ధిని సాధించే ప్రయత్నాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో పంటల విషయంలో రసాయనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు, సమతుల్య, ఆరోగ్యకరమైన పోషక ఆహారాన్ని పండిచడం భారత్‌ ముందున్న లక్ష్యాలుగా చెప్పవచ్చు.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మనుషుల జీవణ ప్రమాణాలతో పాటు, ఆహారం లాంటి విషయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. వాతావరణంలో జరుగుతోన్న మార్పులు, విజృంభిస్తోన్న మహమ్మారుల కారణంగా ఎదురవుతోన్న సవాళ్ల నేపథ్యంలో భారత్‌కు మరింత సురక్షితమైన, స్థిరమైన ఆహార వ్యవస్థ ఎంతైన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్తఆవిష్యరణలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక పంటను దిగుమతి చేయడం ద్వారా భారతదేశానికి ఆహార భద్రత సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు ప్రోటీన్లతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయమై ICAR-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్ రిసోర్సెస్, న్యూఢిల్లీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ KC బన్సల్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సైన్స్‌ ఆధారిత అత్యుత్తమ టెక్నాలజీ అందుబాటులో ఉంది. జన్యుపరమైన మార్పులు చేసిన ఆహారం ఉత్పత్తి చేయడానికి నేను జెనిటిక్‌ ఇంజనీరింగ్ విధానాన్ని సూచిస్తాను. అయితే ఇప్పటి వరకు మనం ఆహార ఉత్పత్తి, నాణ్యతలను పెంచడానికి సంప్రదాయమైన విధానాలనే ఉపయోగిస్తున్నాం. కానీ ప్రస్తుత రోజుల్లో ఆహారంలో ఖనిజాలు, పోషక విలువలు పెంచడానికి జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ విధానాన్ని వాడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం పెంపొందించడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సూచించారు.

‘భారత్‌లో ఎక్కువగా నూనెగింజలు, పప్పు ధాన్యాలను పండించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాయ తొలుచు పురుగు కారణంగా కందులు, శనగల దిగుమతి భారీగా పడిపోతోంది. కాబట్టి ఇలాంటి పంటలతో పాటు ఇతర పంటలను కాపాడడానికి జెనటిక్‌ మాడిఫికేషన్‌ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు వెంటనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. పంటకు నష్టం కలిగించే ఇలాంటి పురుగుల నుంచి పంటలను రక్షించడానికి పురుగుల మందుపై ఆధారపడడాన్ని తగ్గించాలి. జన్యు మార్పిడి విధానం ద్వారా పంట దిగుమతి పెరగడమే కాకుండా, నాణ్యత కూడా పెరుగుతుంది’ అని ప్రొఫెసర్‌ తెలిపారు.

ఇక వ్యవసాయ రంగంలో రావాల్సిన వినూత్న మార్పులపై ది గుడ్‌ఫుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ వరుణ్‌దేశ్‌ పాండే పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు ముందుకు రావాలి. దీని వల్ల వినియోగదారులకు సరైన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఫుడ్‌సైన్స్‌ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. దీని వల్ల శాఖాహార ఆధారిత మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యత లభిస్తోంది. ఇది వ్యక్తులతో పాటు, పర్యవరణానికి కూడా మేలు చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

ప్రముఖ పోషక నిపుణురాలు, న్యూట్రివెల్‌ హెల్త్‌ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్‌ శిఖా శర్మ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, నిల్వలు, రవాణాపరంగా కూడా ఆహార వృధాను తగ్గించాలని సూచించారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘కూరగాయల వంటి తాజా ఉత్పత్తుల్లో సుమారు 60 శాతం గిడ్డంగుల్లో సరిగ్గా నిల్వ చేయకపోవడం, రవాణా సమయంలో సరైన రక్షణ లేకపోవడంతో పాడవుతున్నాయి. సరైన నిల్వలేని కారణంగా ధాన్యాలను ఎలుకలు తిన్న సందర్భాలు అనేకం చూశాము. ఆహారనిల్వ, ప్రాసెసింగ్‌, రవాణా విషయాల్లో శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించడం వల్ల ఆహారభద్రత గణనీయంగా మెరుగుపడుతుంది’ అని శిఖాశర్మ అభిప్రాయపడ్డారు.

ఇక పరిమిత వనరులతో ఆహార ఉత్పత్తిని పెంపొందించడంలో టెక్నాలజీ పాత్ర గురించి ప్రొఫెసర్‌ బన్సల్‌ వివరిస్తూ.. ‘ఆహార ఉత్పత్తిలో విత్తనం ప్రధానమైంది. జన్యుపరమైన మార్పిడి వంటి కొత్త సాంకేతికత ద్వారా తక్కువ రసాయానాల వాడకం, తక్కువ భూమి, నీరు ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తులు అందించేలా విత్తనాల్లో మార్పులు చేయొచ్చు. భారత్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తిని రానున్న రోజుల్లో 300 మిలియన్‌ టన్నులకు మించి పెంచాలనుకుంటే కచ్చితంగా ఇలాంటి సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే’ అనిబన్సల్ సష్టం చేశారు.